AP LAWCET 2024 Counselling: నేటి నుంచి లాసెట్ తుది విడత కౌన్సెలింగ్ షురూ.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
లాసెట్ తుది విడత కౌన్సెలిగ్ నేటి నుంచి ప్రారంభమవుతుంది. తొలి విడతలో సీట్లు పొందని వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని లాసెట్ కన్వినర్ తెలిపారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ప్రారంభమవగా.. నవంబర్ 17వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి షెడ్యూల్ ఈ కింద చెక్ చేసుకోండి..
అమరావతి, నవంబర్ 14: న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే లాసెట్ 2024 తొలి విడత కౌన్సెలింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. లాసెట్ రెండో, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలను కూడా అధికారులు తాజాగా విడుదల చేశారు. తాజా షెడ్యూలు ప్రకారం నేటి (నవంబర్ 14) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందలేని లాసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. నవంబర్ 14 నుంచి 17 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత నవంబర్ 15 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అనంతరం నవంబర్ 20 నుంచి 23 వరకు కళాశాలల ఎంపికకు సంబంధించి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. నవంబర్ 24న వెబ్‌ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ 26న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినవారు నవంబర్ 27 నుంచి 30 లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
NMMSS Exam రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. నవంబరు 24న పరీక్ష
తెలంగాణ విద్యార్థులకు స్కాలర్‌షిప్ మంజూరుకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్) పరీక్ష ఈ ఏడాది కూడా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో ఉంచామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ కృష్ణారావు ప్రకటనలో తెలిపారు. నవంబరు 24న రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
నవంబర్ 19 నుంచి మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ శాఖలోని హోమియో, ఆయుర్వేద విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన నవంబరు 19, 20 తేదీల్లో ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఇందుకు 1:3 నిష్పత్తిలో హోమియోలో 48 మందిని, ఆయుర్వేద విభాగంలో 23 మందిని ఎంపిక చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంపికైనవారంతా సంబంధిత పత్రాలతో ఆయా తేదీల్లో విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో హాజరుకావల్సి ఉంటుంది. అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.