ధర్మారం, అక్టోబర్ 19: ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివాడు ఆయన. కానీ కాలం కలిసి రాకపోవడంతో బతుకు తెరువు కోసం టీకొట్టు పెట్టుకున్నాడు. కానీ తను చేస్తున్న పనిని అందరూ ఎగతాళి చేసినా.. పంటి బిగువున బాధను భరించాడు. కాలం కలిసిరానప్పుడు తగ్గి ఉండటంలో తప్పు లేదని భావించి పోటీ పరీక్షల కోసం పట్టుపదలతో శ్రమించాడు. శ్రమను నమ్ముకుని సర్కార్ కొలువు కోసం పాటుపడిన ఆయనను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. నాడు చులకనగా మాట్లాడిన వారే నేడు శభాష్ అంటూ ప్రశంసించడం మొదలు పెట్టారు. తెలంగాణలోని పెద్ద పల్లి జిల్లా ధర్మారంకి చెందిన ఉడాన్ శివమహేశ్ కుమార్ విజయగాథ ఇది.
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో శివమహేశ్ కుమార్ పేరు ఆరునెలల క్రితం ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ పేరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైన నేటి రోజుల్లో వరుసపెట్టి ఐదు సర్కారీ కొలువులు కొట్టడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. గతేడాది గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడిగా ఎంపికైన శివ మహేశ్.. అక్కడి నుంచి వరుసగా టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్.. తాజాగా డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. టీఎస్‌పీఎస్సీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పోస్టులకు రెండో ర్యాంకు సాధించాడు.
మహేశ్‌కి చిన్నతనం నుంచే హిందీ సబ్జెక్టు అంటే విపరీతమైన ఆసక్తి. దాంతో ఎంఏ హిందీ చదివి, హిందీ పండిత్ శిక్షణ కూడా పూర్తి చేశాడు. మూడేళ్లపాటు వివిధ ప్రైవేటు స్కూళ్లలో హిందీ టీచర్‌గా పని చేశాడు. కానీ అత్తెసరు జీతంతో కష్టాలు ఈదసాగాడు. దీంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసి అతనిలో మరింత ఎక్కువైంది. సాయంత్రం దాకా విధులు నిర్వర్తించి, అర్ధరాత్రి వరకు టీచరు ఉద్యోగానికి సిద్ధమయ్యేవాడు. అలా సన్నద్ధమవుతూనే 2017 డీఎస్సీలో జిల్లాస్థాయిలో రెండో ర్యాంకుతో హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదు. అయినా అధైర్య పడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నాడు. అయితే ఓ మోస్తరుగా గడిచి పోతున్న అతడి జీవితాన్ని కరోనా అతలాకుతలం చేసింది. పని చేస్తున్న స్కూల్ మూతపడటంతో ఉపాధి కరవైంది. దాంతో కుటుంబ పోషణకు పక్క ఊరిలో చాయ్ దుకాణం తెరిచాడు. అప్పుడు చాలామంది నానారకాలుగా ఎగతాళి చేశారు. అయినా అదేమీ పట్టించుకోకుండా సాయంత్రం వరకు టీపాయింట్ నడిపి, ఆ తర్వాత చదువుకునేవాడు. 2023 ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు రావడంతో అదే ఏడాది జనవరిలో కరీంనగర్ వెళ్లాడు. మిత్రుడి గదిలో ఉంటూ, రోజుకు ఐదు రూపాయల భోజనంతో సరిపెట్టుకుంటూ ప్రిపరేషన్ సాగించాడు. ఆ తర్వాత తను రాసిన ప్రతి పరీక్షలోనూ వెనుదిరిగి చూడలేదు. తనను చూసి నవ్విన వారందరికీ వరుస విజయాలతో సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న మహేశ్.. గ్రూప్-1 ఉద్యోగమే తన లక్ష్యమంటున్నాడు.