Indian Army: దేశవ్యాప్తంగా భారత సైన్యం పట్ల ఎంతో గౌరవం ఉంటుంది. చాలా మంది యువత సైన్యంలో ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. అందుకోసం కష్టపడి ఆర్మీలో జాబ్ సంపాదించాలనుకుంటారు. అందుకే నోటిఫికేషన్ విడుదల కావడంతోనే లక్షల మంది యువకులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే ప్రస్తుతం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి సోషల్ మీడియాలో కొత్త సమాచారం వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది అంటే 2022లో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులకు 2 సంవత్సరాల వయస్సు సడలింపు ఇస్తున్నట్లు సమాచారం చక్కర్లు కొడుతుంది. ఇది ఒక టీవీకి సంబంధించిన స్క్రీన్‌షాట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో నిజమెంత..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్క్రీన్ షాట్.. ఫస్ట్ లుక్ లో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రసారమైన వార్తలా అనిపించినా.. నిశితంగా పరిశీలిస్తే.. ఎడిట్ చేసి ప్రిపేర్ చేసినట్లు అనుమానం కలుగుతోంది. ప్రభుత్వ సమాచార ఏజెన్సీ PIB Fact Check ఇది నకిలీదని నిర్ధారించింది. ట్వీట్ చేసి ఇలా రాసింది “భారత ప్రభుత్వం 2022 ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం వయోపరిమితిలో 2 సంవత్సరాల సడలింపు ఇచ్చినట్లు ఒక చిత్రం హల్‌చల్ చేస్తుంది. ఈ దావా నకిలీది. వయోపరిమితిలో అలాంటి మార్పు లేదు. అటువంటి నకిలీ సందేశాలు లేదా చిత్రాలను షేర్ చేయవద్దని PIB సూచించింది”
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం సరైన వయోపరిమితి ఎంత?
ఆర్మీ రిక్రూట్‌మెంట్ సంబంధిత అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in/లో అందించిన సమాచారం ప్రకారం.. ఆర్మీ GD వయస్సు పరిమితి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు. దీనితో పాటు విద్యార్హత 45 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత. ఈ పరీక్షలో అన్ని సబ్జెక్టులలో కనీస మార్కులు 33% ఉండాలి. అయితే గూర్ఖా మహిళా లేదా పురుష అభ్యర్థులకు ఇందులో10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది.