న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2024 ఫలితాలు డిసెంబర్ నెలాఖరు నాటికి లేదంటే జనవరి తొలి వారంలో విడుదలకానున్నాయి. ఇక డిసెంబర్ 3వ తేదీన క్యాట్ 2024 ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదలైంది. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మనేజ్‌మెంట్ కలకత్తా ప్రకటన జారీ చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీతోపాటు క్వశ్చన్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యంతరాలు లేవనెత్తడానికి అబ్జెక్షన్ విండో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచే అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ 5 రాత్రి 11.55 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. అభ్యర్ధులు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఆధారంగా లాగిన్ అయ్యి డిసెంబర్ 5వ తేదీ గడువు సమయంలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో నవంబర్ 26న పరీక్ష నిర్వహించారు. మొత్తం 3.29 లక్షల మంది క్యాట్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారిలో 2.93 మంది పరీక్ష రాశారు. అంటే 89 శాతం మంది పరీక్షకు హాజరయ్యారన్నమాట. వీరిలో 1.07 లక్షల మంది అబ్బాయిలు, 1.86 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. అలాగే ఐదుగురు ట్రాన్స్ జెండర్స్ కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. గతేడాది 85 అభ్యంతరాలు రాగా.. వాటిల్లో కేవలం రెండింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి ఫైనల్ ఫలితాలు విడుదల చేస్తారు. క్యాట్‌లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కాలేజీలు కూడా సీట్లను భర్తీ చేస్తాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షను మే 18వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్ పరీక్ష తేదీని వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో స్కోర్ సాధించిన తొలి 2.50 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 23 ఐఐటీలు ఉండగా.. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2025-26 విద్యాసంవత్సరంలో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశముంది.