White Collar Jobs: కొత్త ఏడాదిలో వైట్ కాలర్ జాబ్స్ దూకుడు.. ఆ 3 రంగాల్లో ఫుల్ డిమాండ్!
కొత్త ఏడాదిలో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. వీటితో పాటు గ్రీన్ ఉద్యోగాలు కూడా నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో వైట్ కాలర్ జాబ్స్ 32 శాతం, గ్రీన్ ఉద్యోగ నియామకాలు కూడా దాదాపు 41 శాతం పెరిగినట్లు ఇన్‌సైట్స్ ట్రాకర్ తాజా నివేదిక వెల్లడించింది..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశంలో వైట్-కాలర్ ఉద్యోగ నియామకాలు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 32 శాతం పెరిగినట్లు ఇన్‌సైట్స్ ట్రాకర్ తాజా నివేదిక వెల్లడించింది. సెమీకండక్టర్లు, ఎనర్జీ, వ్యర్థాల నిర్వహణ, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. వినియోగదారుల డిమాండ్ పెరుగుదల, కేంద్ర బడ్జెట్ 2025-26 నుంచి వ్యూహాత్మక ప్రోత్సాహకాల చొరవల దృష్ట్యా.. ఈ నియామకాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది.
ఇక అలాగే క్లీన్ ఎనర్జీలో గత రెండేళ్లలో గ్రీన్ ఉద్యోగాలు కూడా గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఈ రంగంలో దాదాపు 41 శాతం నియామకాలు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. బెంగళూరు, ఢిల్లీ, పూణే.. కీలక కేంద్రాలుగా ఈ ఉద్యోగాలు ఉద్భవించాయి. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల వృద్ధి కారణంగా 2025లో గ్రీన్ ఉద్యోగాలకు మరో 11 శాతం డిమాండ్ పెరుగుతుందని అంచనా. దీంతో దేశ జాబ్ మార్కెట్‌లో వేగవంతమైన వృద్ధి కనిపిస్తుంది. పలు కీలక పరిశ్రమలలో నియామకాలు పెరుగుతున్నాయి. ట్రావెల్, రిటైల్, గ్రీన్ ఉద్యోగాలు వంటి రంగాల్లో ఉద్యోగ నియామకాలు మాంచి ఊపుమీద ఉన్నాయి. ఇవన్నీ బిజినెస్ కాన్ఫిడెన్స్, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుందని ఫౌండిట్‌లోని చీఫ్ రెవెన్యూ, గ్రోత్ ఆఫీసర్ ప్రణయ్ కాలే అన్నారు. వీటికి తోడు పునరుత్పాదక ఇంధనం, సస్టైనబుల్ ఫోకస్డ్ పరిశ్రమలకు మద్దతుగా ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ నిబంధనలు ఈ నియామకాల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
రిటైల్, ట్రవెల్, టూరిజమ్ రంగాల్లోనూ గణనీయమైన వృద్ధి
పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్, ప్రభుత్వ చొరవ కారణంగా ట్రావెల్, టూరిజం రంగం జనవరిలో 17 శాతం నియామకాల పెరుగుదల కనిపించింది. AI ఆధారిత ట్రావెల్ టెక్నాలజీలో ఏవియేషన్, లగ్జరీ టూరిజం, ఎకో-టూరిజంలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఇక రిటైల్ రంగంలో 24 శాతం నియామక వృద్ధి కనిపించింది. ఫలితంగా జాబ్ మార్కెట్లో సప్లై చైన్ మేనేజ్‌మెంట్, కస్టమర్ అనుభవం, AI-ఆధారిత రిటైల్ విశ్లేషణలలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నియామకాల్లో టైర్ 2 నగరాలు హబ్‌లు ఉపాధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








