మేడ్చల్, నవంబర్ 8: తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు మరో రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ 10 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక గ్రూప్ 3 పరీక్షలు ఈ నెల 17, 18వ తేదీలలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 65,361 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయని నవంబర్ 17న పేపర్-1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందని తెలిపారు.
ఇక నవంబర్ 18న పేపర్ 3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇలా మొత్తం 3 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గ్రూప్ 3 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి కమిషన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే TGPSC టెక్నికల్ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్ 040-2354 2185 లేదా 040-2354 2187 సంప్రదించాలని లేదా HELPDESK@TSPSC.GOV.IN కు ఇమెయిల్ చేయవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సులన్నింటికీ పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర అన్ని కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును నవంబర్ 14వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో నవంబర్ 18వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. డిగ్రీ పరీక్షలు వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ అధికారిక వెబ్‌సైట్ లో చూసుకోవచ్చని సూచించారు.