న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల తేదీలను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ విడుదల చేసింది. నవంబర్ 25, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్) ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయా పోస్టులను ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
2023-24 విద్యాసంవత్సరానికి గానూ వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును విద్యాశాఖ పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజును నవంబరు 17వ తేదీ నుంచి డిసెంబరు 2 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకుడు కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీపీగెట్ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన సీట్ల వివరాలను నవంబరు 15న విడుదల చేశారు. చివరి విడతలో 11,325 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిల్లో 6,491 మంది విద్యార్ధులకు సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన వారు నవంబరు 18వ తేదీలోపు సంబంధిత కాలేజీలో రిపోర్టు చేయాలని కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.
మాచవరంలోని డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రం 2017కి ముందు చేరిన విద్యార్థులు పరీక్షల ఫీజు నవంబరు 18వ తేదీలోపు చెల్లించాలని డిప్యూటీ డైరెక్టర్ ఎం అజంతకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.500ల అపరాధ రుసుంతో నవంబరు 23వ తేదీలోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 9 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ద్వితీయ సంవత్సర పరీక్షలు డిసెంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు, అలాగే తృతీయ సంవత్సర పరీక్షలు డిసెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. పరీక్ష ఫీజును విద్యార్ధులు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.