
అమరావతి, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తికాగా మరో మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్ 1 అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నద్ధం అవుతోంది. కమిషన్ విజ్ఞప్తి మేరకు ఇంటర్వ్యూ బోర్డులో ప్రభుత్వ ప్రతినిధులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ ప్యానెలో 27 మంది ప్రభుత్వ విభాగాధిపతులను ఇంటర్వ్యూ బోర్డులో నియమించింది.
ఈ 27 మంది ప్రభుత్వ విభాగాధిపతుల్లో ఉన్నవారందరూ కమిషనర్లు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల హోదాలో ఉన్నవారే కావడం విశేషం. వీరంతా ఏపీపీఎస్సీ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేయనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు తీసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శిని సీఎస్ కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో ఇంటర్య్వూకి మొత్తం 182 మంది అర్హత సాధించారు. వీరందరికీ 18 రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగనున్నాయి. జూన్ 23 నుంచి జులై 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు షెడ్యూల్ ప్రకారం రోజుకు 10 మంది చొప్పున జరగనున్నాయి. ఈ మేరకు సంబంధిత ఇంటర్వ్యూ తేదీలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
కాగా ఏపీపీఎస్సీ మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. తుది దశ అయిన ఇంటర్యూ అనంతరం అభ్యర్ధుల మార్కులతో కూడిన ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను కమిషన్ విడుదల చేస్తుంది. అనంతరం ఎంపికైన వారందరికీ నియామక పత్రాలు అందజేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.