పొలం పనులు చేసుకుంటూనే.. NEETలో సత్తా చాటిన రైతు కొడుకు! ఇది కదా సక్సెస్ అంటే..
నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ జూన్ 14న ప్రకటించిన NEET UG 2025 ఫలితాల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన రాంబాబు డాంగి అనే రైతు కుమారుడు 720కు 530 మార్కులు సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. తన తండ్రితో కలిసి పొలం పనులు చేస్తూనే చదువుకుని ఈ విజయాన్ని అందుకున్న రాంబాబు, తన ఊరిలో మొదటి MBBS డాక్టర్ కానున్నాడు.

జూన్ 14న నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ NEET UG 2025 ఫలితాలను ప్రకటించింది. చాలా మంది అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వారిలో ఒకరు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని రాజ్‌పూర్ ఖేడా గ్రామానికి చెందిన రాంబాబు డాంగి. తొలి ప్రయత్నంలోనే NEET UG పరీక్షలో ఉత్తీర్ణుత సాధించాడు. 720 మార్కులకు 530 మార్కులు వచ్చాయి. అయితే.. అతని సక్సెస్ స్టోరీ ఎందరికో స్ఫూర్తి నిచ్చేలా ఉంది. ఎదుకంటే.. అతనో రైతు కొడుకు, పొలం పనుల్లో తండ్రికి సాయం చేస్తూనే.. అతను నీట్‌లో సత్తా చాటాడు. అతని సక్సెస్ స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకుందాం..
700 జనాభా ఉన్న గ్రామం నుంచి డాక్టర్ కాబోతున్న మొదటి వ్యక్తి రాంబాబు. అతని తండ్రి రతన్‌లాల్ ఒక రైతు, తల్లి భగవతి బాయి గృహిణి. రాంబాబు తన తండ్రితో కలిసి పొలాల్లో పనిచేసేవాడు దాంతో పాటే చదువు కూడా కొనసాగించాడు. రాంబాబు OBC-NCL (సెంట్రల్ లిస్ట్) విభాగంలో 10,816వ ర్యాంక్ సాధించాడు. అతను నీట్ ప్రిపరేషన్ కోసం కోటలోని ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. అతను కష్టపడి చదివి 12వ బోర్డు పరీక్షతో పాటు నీట్‌కు సిద్ధమయ్యాడు. అతని కృషి ఫలించింది. మొదటి ప్రయత్నంలోనే నీట్ UGలో ర్యాంక్ సాధించాడు. అతనికి వచ్చిన ర్యాంకును బట్టి ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందే అవకాశాలు ఉన్నాయి.
రాంబాబు సాధించిన ఈ విజయంతో ఆ ఊరంతా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే తమలో ఒకడు డాక్టర్ కాబోతున్నాడని వారి ఆనందం. రైతు రతన్‌లాల్ తనకున్న కొద్ది భూమిలో వ్యవసాయం చేస్తూ తన కొడుకు చదివించాడు. రాంబాబు కూడా తన తండ్రి కష్టం చూస్తూ పెరిగాడు. తన బాధ్యతను అర్థం చేసుకుని కష్టపడి పని చేయడంతో పాటు చదువుకున్నాడు. 10వ తరగతిలో 86 శాతం మార్కులు సాధించిన తర్వాత వైద్య వృత్తిని ఎంచుకోవాలని రాంబాబు నిర్ణయించుకున్నాడు.
“మా గ్రామంలో జనాభా కేవలం 700 మాత్రమే, నేను ప్రతిరోజూ 25 కిలోమీటర్లు బస్సులో పాఠశాలకు వెళ్లేవాడిని. నా 11వ తరగతి తర్వాత కోటాలో నీట్ యుజి కోచింగ్ కోసం సిద్ధం కావడం ప్రారంభించాను. నా లక్ష్యం 650 మార్కులు, అన్ని మార్కులు వస్తేనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వస్తుంది. నేను 12వ తరగతిలో 92 శాతం మార్కులు సాధించాను. ఇప్పుడు నేను మా గ్రామంలో మొదటి MBBS డాక్టర్‌ని అవుతాను.” అంటూ రాంబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




