అమరావతి, డిసెంబర్ 12 : యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెలలో నిర్వహించాల్సిన స్క్రీనింగ్ పరీక్ష వాయిదా పడింది. రాష్ట్ర హైకోర్టులో నడుస్తోన్న కేసుల కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబరు 18 నుంచి 23 వరకు, జనవరి 5న స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ప్రాథమిక షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. యూనివర్సిటీల్లో మొత్తం 3,282 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతోన్న సంగతి తెలిసిందే.
న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌ఎల్‌ఎం రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్‌వీ శ్రీరంగప్రసాద్ డిసెంబరు 11న ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు డిసెంబరు 16లోగా అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఎస్‌బీటీఈటీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. తుది గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించి, పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్స్‌పల్ డాక్టర్ కె సుధాకర్ సోమవారం (డిసెంబరు 11) తెలిపారు. ఈ పోస్టులకు డిసెంబరు 13వ తేదీ ఉదయం పది గంటల నుంచి కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీనియర్ రెసిడెంట్ల నియామకంతో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తద్వారా రోగులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలకు సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.