AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర! 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ పెట్టుబడుల జోరు కనిపిస్తోంది. ఐటీ, ఇంధనం, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో 39 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి..

AP Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర! 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్
Andhra Pradesh SIPB Approves Another Project
Eswar Chennupalli
| Edited By: |

Updated on: May 06, 2026 | 4:06 PM

Share

అమరావతి, మే 6: విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్ నుంచి తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ తయారీ పరిశ్రమ వరకు పలు కీలక ప్రాజెక్టులకు 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఆమోదం లభించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 25 ప్రాజెక్టులకు చెందిన రూ.2,01,023 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు. రాష్ట్రంలో పెట్టుబడులు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా.. గ్రౌండ్ స్థాయిలో కనిపించాలన్న దిశగా ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

విశాఖలో రిలయన్స్ మరో భారీ డేటా సెంటర్

తాజా పెట్టుబడుల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది రిలయన్స్ సంస్థ ప్రతిపాదించిన డేటా సెంటర్ ప్రాజెక్టు. విశాఖలో రూ.1,08,010 కోట్లతో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుతో వెయ్యి మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో ఐటీ రంగ విస్తరణకు ఇది కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో శ్రీసత్యసాయి జిల్లాలో రిలయన్స్ సంస్థ రూ.51,300 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

కడపలో అదానీ ప్రాజెక్టు

ఎనర్జీ రంగంలో మరో కీలక పెట్టుబడిగా కడప జిల్లాలో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిలిచింది. రూ.12,297 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 3,375 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తిరుపతి జిల్లాలో యమాన్కో ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. రూ.9,398 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో 5,820 మందికి ఉపాధి దక్కనుంది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని విస్తరించే దిశగా పలు బయో ఫ్యూయల్, సీబీజీ, బయోగ్యాస్ ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇచ్చారు. విజయనగరం, నెల్లూరు, పలనాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి.

ఇవి కూడా చదవండి

తిరుపతికి రాయల్ ఎన్‌ఫీల్డ్

తిరుపతి జిల్లాకు మరో పెద్ద పరిశ్రమ రానుంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ రూ.2,508 కోట్లతో మోటార్ సైకిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అదే జిల్లాలో అపోలో టైర్స్ రూ.6,100 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ సంస్థ కూడా బల్క్ చిల్లర్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. దీంతో తిరుపతి జిల్లా పారిశ్రామిక హబ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం

వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో స్నేహా ఫార్మ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆమోదం లభించింది. కొబ్బరి, మామిడి, ఆయిల్ పామ్, కోకో వంటి పంటలకు విలువ జోడిస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రానికి మంచి అవకాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒప్పందం గ్రౌండ్ కావాలనీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడులపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలనీ ప్రతి ఒప్పందం పరిశ్రమగా కనిపించాలని అన్నారు. పెట్టుబడులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియలో ఒక్కరోజు కూడా ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ఏపీ ప్రత్యేక బ్రాండ్‌గా నిలవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల కంటే వేగంగా, సులభంగా అనుమతులు ఇచ్చే వ్యవస్థను నిర్మించాలని అధికారులకు ఆదేశించారు.

ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం

భారీ పరిశ్రమలతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” లక్ష్యాన్ని సాధించడంలో ఎంఎస్ఎంఈలు కీలకమని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతాలకు గ్యాస్ పైప్‌లైన్ సదుపాయం కల్పించాలని.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us