AP BC Gurukula Admissions 2025: బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎంట్రన్స్ టెస్ట్ తేదీ ఇదే!
మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన బీసీ బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6600 సీట్లను మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా బాలబాలికలకు వేర్వేరుగా సీట్లు కేటాయిస్తారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPAPBCWCET) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన బీసీ బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బీసీ గురుకుల పాఠశాలల్లో 6600 సీట్లు ఉన్నాయి. మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా బాలబాలికలకు వేర్వేరుగా సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్ధులకు 5వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన బీసీ విద్యార్ధులతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు కూడా ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చు.
మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధిత జిల్లాల్లోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతిలో చదివి లేదా చదువుతూ ఉండాలి. అలాగే ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల వయసు 11 ఏళ్లకు, ఎస్సీ/ ఎస్టీ విద్యార్థుల వయసు 12 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తుదారుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో మార్చి 15, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమైనాయి. దరఖాస్తు రుసుము కింద ప్రతిఒక్కరూ రూ.100 చెల్లించాలి. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష విధానం..
ప్రవేశ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగులో 15 మార్కులు, ఇంగ్లిష్‌లో 25 మార్కులు, గణితంలో 30 మార్కులు, పరిసరాల విజ్ఞానంలో 30 మార్కులు చొప్పున నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ 2025-26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




