School Holidays 2025: రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. కారణం ఇదే!
Cyclone Montha school holidays in Andhra Pradesh: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో కదిలిన తీవ్ర వాయుగుండంగా మారింది. రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు..

అమరావతి, అక్టోబర్ 26: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయగుండంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో కదిలిన తీవ్ర వాయుగుండంగా మారింది. రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఇక మంగళవారం ఉదయం నాటికి అది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. దూసుకొస్తున్న మొంథా తుపాను కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
ఇందులో భాగంగా పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రేపట్నుంచి (అక్టోబర్ 27) వరుస సెలవులు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలకు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో సోమవారం (అక్టోబర్ 27) నుంచి ఈ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ జిల్లాలోని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్‌వాడీలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక అనకాపల్లి జిల్లాలోని విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 వరకు మొత్తం మూడు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటనలో తెలిపారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోనూ అక్టోబర్ 27, 28వ తేదీల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా విద్యా సంస్థలను తెరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతాల్లో మొంథా తుపాను ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, తుపాను పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ 27 తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దంటూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, జాలరులు చేపట వేటకు వెళ్లరాదని అన్నారు. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో పలు బీచ్‌లను కూడా అధికారులు మూసివేశారు. మంగళవారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉన్నందున అప్పటి వరకు జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




