Yamaha R15 Bike: మీకు స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టమా.. దానికోసం ఎక్కువగా ఖర్చు చేయలేరా.. అయితే యమహా మోటార్ ఇండియా మీ అభిరుచికి తగిన విధంగా స్పోర్ట్స్ బైక్‌ని తీసుకొచ్చింది. వైజెడ్‌ఎఫ్-ఆర్15 వీ4.0 బైక్‌ను సరికొత్త డిజైన్‌తో రిలీజ్ చేసింది. ధర పరంగా చూసినా ఇతర స్పోర్ట్స్ బైక్‌ల కంటే చాలా తక్కువ. దీంట్లో స్టాండర్డ్, ‘ఎం’ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరల శ్రేణి రూ.1,67,800- రూ.1,77,800 మధ్య ఉంది. మనుపటి వైజెడ్‌ఎఫ్-ఆర్15తో పోలిస్తే ఈ కొత్త బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల డిజైన్ మారింది. స్టెప్ అప్ సీట్, ఎం ఆకారంలో ఎయిర్ డక్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ వంటి కొత్త ఫీచర్లను పొందుపరిచారు. 155 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది.18.3 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.
యమహా కొత్త మ్యాక్సీ స్కూటర్..
ఈ బైక్‌తో పాటుగా యమహా ఇండియా ఏరోక్స్ 155 అనే మరో కొత్త మ్యాక్సీ స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.29 లక్షలు. ఈ నెలాఖరు కల్లా ఇవి షోరూంలకు చేరుకుంటాయి. రేసింగ్ బ్లూ, గ్రే వెర్మీలియన్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌లో 155 సీసీ, వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ (వీవీఏ)తో కూడా బ్లూ కోర్ ఇంజిన్ ఇచ్చారు. 8000 ఆర్‌పీఎం వద్ద 15 పీఎస్ శక్తిని, 13.9 ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కంప్రెషన్ రేషియోను పెంచి కంబషన్ సామర్థ్యాన్ని పెంచేలా ఇంజిన్‌లో కొత్త సిలిండర్ హెడ్‌తో పాటు కాంపాక్ట్ కంబషన్ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు.
సింగిల్ ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ ఎనేబుల్డ్ యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ యాప్, 5.8 అంగుళాల ఎల్‌సీడీ క్లస్టర్, సీటు కింద 24.5 లీటర్ స్టోరేజీ సామర్థ్యం గల ట్యాంకును పొందుపరిచారు. అయితే యువతలో యమహా కంపెనీ బైక్స్‌కి, స్కూటర్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. మార్కెట్లో ఉన్న అన్ని టూ వీలర్ కంపెనీల బైక్‌లకి ఇవి పోటీ ఇస్తాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.