Silver Price: చైనాలో చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. ఎంతో తెలిస్తే షాకే.. ఆ ఒక్క నిర్ణయమే కారణమా..?
లాభాల పంట పండిస్తున్న బంగారం, వెండి మార్కెట్‌లో భారీ కరెక్షన్ చోటుచేసుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో ట్రేడర్లు భారీగా ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో ధరలు అనూహ్యంగా కుప్పకూలాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గుతున్నా చైనాలో మాత్రం వెండి ధరలు వింతగా పెరుగుతున్నాయి. అక్కడ రేట్లు ఎలా జరిగాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

త కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. శనివారం భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ వారం ఆరంభంలో రికార్డు గరిష్టాలను తాకిన ధరలు, వారాంతానికి వచ్చేసరికి భారీ దిద్దుబాటుకు గురవ్వడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుండే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫిబ్రవరి 2026 గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ. 10,000 తగ్గి.. 10 గ్రాముల ధర రూ. 1,61,000 వద్ద ట్రేడవుతోంది. మార్చి 2026 సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.24,000 మేర పతనమై, కిలో ధర రూ. 3,75,900కు చేరుకుంది. గత కొన్ని రోజులుగా లాభాల్లో ఉన్న వ్యాపారులు ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చైనాలో వెండి వింత పోకడ..
ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గుతున్నా, చైనాలో మాత్రం వెండి ధరలు మంట పుట్టిస్తున్నాయి. నిజానికి భారత్ లేదా అమెరికా కంటే చైనాలోనే వెండి అత్యంత ఖరీదుగా ఉండటం విశేషం. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సుకు 109 డాలర్లు ఉంటే.. చైనాలో మాత్రం 125 డాలర్లు పలుకుతోంది. అంటే మన కరెన్సీలో లెక్కిస్తే.. ప్రపంచ మార్కెట్ కంటే చైనాలో వెండి కిలోకు రూ.51,000 ఎక్కువగా ఉంది.
చైనాలో రేట్లు ఎందుకు తగ్గట్లేదు?
ప్రపంచంలోని మొత్తం వెండిలో 65శాతం చైనా ఒక్కటే వినియోగిస్తోంది. పరిశ్రమలతో పాటు పెట్టుబడిగా కూడా అక్కడ వెండికి విపరీతమైన క్రేజ్ ఉంది. జనవరి నుండి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. లైసెన్స్ ఉన్న కంపెనీలు మాత్రమే ఎగుమతి చేయాలి. దీనివల్ల స్థానిక మార్కెట్లో సరఫరా తగ్గి ధరలు పెరిగాయి.
పెట్టుబడిదారులు ఏం చేయాలి?
ధరల్లో భారీ ర్యాలీ వచ్చినప్పుడు ఇలాంటి దిద్దుబాట్లు సహజమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ అస్థిరంగా ఉన్నందున, కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కొంత కాలం వేచి చూడటం లేదా జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిదని సూచిస్తున్నారు.




