Health Insurance: ఉద్యోగం మానేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ పోతుందా? నిపుణులు చెప్పే విషయాలు తెలిస్తే షాక్
ఇటీవల కాలంలో భారతదేశంలో కార్పొరేట్ కల్చర్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువ మంది బీటెక్ వంటి కోర్సులు చేయడంతో కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే చాలా కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. కార్పొరేట్ ఆరోగ్య బీమా అనేది సంస్థలు తమ ఉద్యోగులకు, కొన్నిసార్లు వారి కుటుంబాలకు కవరేజ్ అందిస్తుంది.

కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రాథమిక వైద్య ఖర్చుల నుంచి రక్షణ లభిస్తుంది. ఉద్యోగులు తరచుగా అదనపు ప్రయోజనాల కోసం టాప్-అప్ ప్లాన్‌ను జోడించడానికి ఎంచుకుంటారు. అయితే అదనపు ఖర్చును వారే భరించాల్సి ఉంటుంది. అయితే ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతే కార్పొరేట్ ఆరోగ్య బీమాకు ఏమి జరుగుతుంది? ఒక ఉద్యోగి రాజీనామా చేసినా లేదా కంపెనీ నుంచి తొలగించినా కార్పొరేట్ ఆరోగ్య బీమా ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నంత కాలం మాత్రమే దాని ప్రయోజనాలను పొందగలరు. ఉద్యోగ మార్పు లేదా తొలగింపు సందర్భంలో కార్పొరేట్ ఆరోగ్య బీమా కూడా ఆగిపోతుందని వివరిస్తున్నారు. అలాగే వైద్య ఖర్చుల రీఫండ్ కోసం పాలసీలో మధ్యంతర రద్దు షరతులు పేర్కొంటే తిరిగి చెల్లిస్తారు. మీరు రీఫండ్ డబ్బును తిరిగి పొందుతారా? లేదా? అనేది బీమా కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
అనేక బీమా ప్రొవైడర్లు కార్పొరేట్ పాలసీలను వ్యక్తిగత ఆరోగ్య పాలసీలుగా మార్చుకునే సౌకర్యాన్ని అందిస్తున్నారు. కంపెనీని విడిచిపెట్టే ముందు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను వ్యక్తిగత పాలసీగా మార్చవచ్చా? లేదా? అని హెచ్ఆర్, బీమా ప్రొవైడర్‌ను అడగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొంత వెయిటింగ్ పీరియడ్ పేర్కొన్న తర్వాత పాలసీ మార్పు సాధ్యం అవుతుందని చెబుతున్నారు.
పాలసీ మార్పు తర్వాత కవరేజ్‌లో ఎలాంటి అంతరం ఉండదని పేర్కొంటున్నారు. ఇది కార్పొరేట్ పాలసీ కంటే ఖరీదైనది అయినప్పటికీ ఇది దీర్ఘకాలికంగా ఎక్కువ భద్రతను అందిస్తుంది. ఉద్యోగాలు వదిలివేసినా లేదా మారినా నిరంతర బీమా కవరేజీని నిర్ధారించడానికి కార్పొరేట్ పాలసీతో పాటు మీ సొంత వ్యక్తిగత పాలసీని కలిగి ఉండటం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగం మానేస్తే కార్పొరేట్ ఆరోగ్య బీమా ఆగిపోయినప్పటికీ ఉద్యోగులు ముందస్తుగా వ్యవహరించడం ద్వారా నిరంతరాయ కవరేజీని కొనసాగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సొంత వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉండటం చాలా అవసరమని నిపుణులు వివరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








