బంధువులను సాగనంపేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నారా? ఈ తప్పు చేయకండి..
Vande Bharat: వందే భారత్ రైల్లో ప్రయాణాలు చేసేవారు, వారికి వీడ్కోలు పలికేందుకు వచ్చేవారికి రైల్వేశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల 12 మంది తమవారిని సాగనంపడానికి వచ్చిన ట్రైన్ లోపల చిక్కుకుపోయారు. ఆటోమేటెడ్ డోర్లు మూతపడటంతో ట్రైన్ కదిలే సమయానికి కిందకు దిగలేకపోయారు.

సాధారణంగా ప్రయాణికులను ట్రైన్ ఎక్కించడానికి, దించడానికి లేదా సామాన్లు వారి సీట్లలో పెట్టడానికి వారికి తోడుగా స్నేహితులు లేదా కుటుంబసభ్యులు, బంధువులు లాంటివారు వస్తుంటారు. ఇలాంటి సమయంలో ట్రైన్ లోపలికి వచ్చి వారికి వీడ్కోలు చెప్పడం, సామాన్లను సీట్లపైన పెట్టడం లాంటివాటికి వెంట వచ్చినవారు సహాయం అందిస్తారు. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లల్లో మాన్యువల్ డోర్లు ఉంటాయి. దీని వల్ల ప్రయాణికుల వెంట వచ్చినవారు కోచ్ లోపలికి వచ్చి వీడ్కోలు చెప్పి ట్రైన్ బయల్దేరే సమయానికి దిగవచ్చు. రైలు ఫ్లాట్ మీద నుంచి బయల్దేరేందుకు నెమ్మదిగా కదులుతున్నప్పుడు సులువుగా కిందకు దిగవచ్చు.
అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో మాత్రం ఇలా దిగడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆటోమేటెడ్ సెన్సార్ డోర్లు ఉంటాయి. ఇవి రైలు బయల్దేరడానికి ముందే క్లోజ్ అవుతాయి. ఒక్కసారి క్లోజ్ అయితే తర్వాతి స్టాప్ వచ్చేంతవరకు ఓపెన్ కావు. దీంతో ప్రయాణికుడికు వీడ్కోలు చెప్పడానికి వచ్చినవారు సెన్సార్ డోర్ సిస్టమ్ వల్ల కోచ్ లోపలే చిక్కుకునే అవకాశముంది. ఇలా చాలామంది చిక్కుకుపోవడం వల్ల జరిమానాలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో వందే భారత్ రైళ్లల్లో ప్రయాణాలకు సంబంధించి రైల్వేశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ప్రయాణికులకు వీడ్కోలు చెప్పడానికి వచ్చినవారు, సామాన్లు లోపల పెట్టడానికి, ట్రైన్ ఎక్కించేందుకు సహాయం చేయడానికి వచ్చినవారు కోచుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించింది. కోచ్ లోపల ఉన్నప్పుడు ఆటోమేటెడ్ డోర్లు మూసుకుపోతే సమస్యల్లో పడతారని తెలిపింది.
వందే భారత్ రైళ్లు అన్ని స్టేషన్లలో ఆగవు. చాలా తక్కువ స్టేషన్లలో మాత్రమే నిలుస్తాయి. చిక్కుకున్న ప్రయాణికులు ట్రైన్ దిగాలంటే వందల కిలోమీటర్ల మేర తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. దీంతో టికెట్ లేనందుకు వారికి రైల్వేశాఖ భారీగా జరిమానా విధిస్తుంది. టీటీఈ మీకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తారు. తదుపరి స్టేషన్ వరకు ఛార్జీతో పాటు అదనంగా పెనాల్టీ పడుతుంది. ఇలాంటి సమయంలో చైన్ లాగి ట్రైన్‌ను ఆపడం కూడా దుర్వినియోగంగా పరిగణిస్తారు. కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే చైన్ లాగాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించి మీరు చైన్ లాగితే భారీ పెనాల్టీ, జైలుశిక్ష పడుతుంది. దీంతో వెంట వచ్చినవారు ఫ్లాట్ ఫాం మీదనే ఉండి తమవారిని సాగనంపాలి. ప్రయాణీకులు వృద్ధులైతే ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న అధీకృత పోర్టర్ల సహాయం తీసుకోవాలని రైల్వేశాఖ తెలిపింది. సామాన్లు ఎక్కువగా ఉన్నప్పుడు మందుగానే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని సూచించింది. వందే భారత్ రైళ్లు ఎక్కువసేపు ఆగవు. దీని వల్ల వెంట వచ్చిన ప్రయాణికులు చిక్కుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
