AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra: గుడ్లను కంటికి రెప్పలా కాపాడుతుంది.. పిల్లలు పుట్టే ముందు ఎందుకు వెళ్లిపోతుంది?

King Cobra Unknown Facts: సాధారణంగా పాములు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పట్టించుకోవు. కానీ కింగ్ కోబ్రా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన శైలిని కలిగి ఉంటుంది. గుడ్ల కోసం ప్రత్యేకంగా గూడు నిర్మించి, దాదాపు రెండు నెలల పాటు ఆహారం తీసుకోకుండా కాపలా కాస్తుంది. అయితే పిల్లలు బయటకు రావడానికి వారం రోజుల ముందే గూడును వదిలి వెళ్లిపోతుంది. ఇంతకీ రాచనాగు అలా ఎందుకు చేస్తుంది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏమిటి?

King Cobra: గుడ్లను కంటికి రెప్పలా కాపాడుతుంది.. పిల్లలు పుట్టే ముందు ఎందుకు వెళ్లిపోతుంది?
King Cobra Unknown Facts
Janardhan Veluru
|

Updated on: Nov 24, 2026 | 1:51 PM

Share

రాచనాగు లేదా గిరినాగు (King Cobra) పేరు వినగానే చాలామందికి భయం కలుగుతుంది. పడగ విప్పి బుసలు కొడుతూ దూసుకొస్తే.. ఎదురుగా ఎవరున్నా వణికిపోవాల్సిందే. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటిగా పేరొందిన కింగ్ కోబ్రాలో మరో అద్భుతమైన లక్షణం కూడా ఉంది. తన గుడ్లను కాపాడుకోవడం కోసం ఏకంగా రెండు నెలలకు పైగా ఆహారం తీసుకోకుండా గడుపుతుంది. అయితే, ఇన్ని రోజులు కష్టపడి కాపాడిన గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడానికి వారం రోజుల ముందే గూడును వదిలి వెళ్లిపోతుంది. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది.

ప్రత్యేకంగా గూడు నిర్మించుకునే ఏకైక పాము!

సాధారణంగా పాములు చెట్ల తొర్రలు, మట్టి బొరియలు, చెదల పుట్టల్లో గుడ్లు పెట్టి వెళ్లిపోతుంటాయి. కానీ రాచనాగు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. గుడ్ల కోసం ప్రత్యేకంగా గూడును నిర్మించుకుంటుంది. ఈ విషయంలో మిగిలిన అన్ని పాముల కంటే భిన్నమైనదిగా కింగ్ కోబ్రాకు గుర్తింపు ఉంది. ఆడ రాచనాగు ఎండిపోయిన ఆకులు, చిన్నచిన్న పుల్లలను సేకరించి గుట్టలా పేర్చుతుంది. సుమారు 3 నుంచి 4 అడుగుల ఎత్తులో గోపురం ఆకారంలో గూడును నిర్మిస్తుంది. వర్షపు నీరు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు కొద్దిగా ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకుంటుంది. ఈ గూడులో సుమారు 20 నుంచి 40 గుడ్లను పెడుతుంది.

కుళ్లిన ఆకుల ద్వారా గుడ్లకు వెచ్చదనం

సాధారణంగా పక్షులు గూడులోని గుడ్లపై కూర్చుని వాటికి వెచ్చదనాన్ని అందిస్తాయి. కానీ రాచనాగు మాత్రం దీనికి భిన్నమైన పద్ధతిని అనుసరిస్తుంది. గూడులో పేర్చిన ఎండిన ఆకులు కుళ్లిపోయే సమయంలో విడుదలయ్యే వేడితో గుడ్లకు అవసరమైన ఉష్ణోగ్రత అందుతుంది. గూడులో గాలి ప్రసరణకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఓ ఇంజనీర్‌లా గుడ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది రాచనాగు.

ఇవి కూడా చదవండి

రెండు నెలలకు పైగా ఆహారం లేకుండా కాపలా!

గుడ్లు పెట్టిన తర్వాత ఆడ రాచనాగు వాటిని కాపాడేందుకు గూడు దగ్గరే తిష్టవేసి ఉంటుంది. సుమారు 60 నుంచి 80 రోజుల పాటు గుడ్లకు కాపలాగా ఉంటుంది. ఈ సమయంలో ఆహారం తీసుకోకుండా గడుపుతుంది. గుడ్లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. అడవి పందులు, గద్దలు లేదా మనుషులు గూడు దగ్గరకు వస్తే తీవ్రంగా బుసలు కొడుతూ ఎదురుదాడికి కూడా దిగుతుంది. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గుడ్లను రక్షించేందుకు ప్రయత్నిస్తుంది.

వారం ముందే గూడును ఎందుకు వదిలేస్తుంది?

రాచనాగు ప్రవర్తనలో అత్యంత ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. దాదాపు 80 రోజుల పాటు గుడ్లను కాపాడిన రాచనాగు..గుడ్ల నుంచి పిల్ల రాచనాగులు బయటకు రావడానికి వారం రోజుల ముందే రాచనాగు వదిలిపెట్టేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆకలి. ఇన్ని రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడంతో తల్లి పాముకు తీవ్రమైన ఆకలి వేస్తుంది. ఆ సమయంలో దాని సహజమైన వేట ప్రవృత్తి బలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలను ఆహారంగా భావించి తినే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే పిల్లలు బయటకు రావడానికి ముందే తల్లి రాచనాగు.. గూడును విడిచిపెడుతుందని వన్యప్రాణి నిపుణులు చెబుతారు.

చూడటానికి అత్యంత భయంకరంగా కనిపించే రాచనాగంలోనూ తన సంతానాన్ని కాపాడాలనే సహజ ప్రవృత్తి కనిపిస్తుంది. రెండు నెలలకు పైగా ఆహారం లేకుండా గుడ్లను కాపాడటం, చివరకు తన పిల్లలకు ఎలాంటి ప్రమాదం కలగకూడదనే ఉద్దేశంతో గూడును వదిలి వెళ్లడం ప్రకృతిలోని అద్భుతమైన జీవన విధానానికి నిదర్శనం.

Follow Us