Used Cars: పెరుగుతున్న సెకండ్ హ్యాండ్ కార్ల డిమాండ్.. మారుతీ ఆల్టో అంటే విపరీతమైన క్రేజ్.. ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ కార్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కోవిడ్ ఇబ్బందుల నేపధ్యంలో చాలా మంది ప్రజలు సొంత కారు ఉండాలని కోరుకోవడం..

Used Cars: ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ కార్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కోవిడ్ ఇబ్బందుల నేపధ్యంలో చాలా మంది ప్రజలు సొంత కారు ఉండాలని కోరుకోవడం.. మరోవైపు చిప్ (సెమీ కండక్టర్) కొరత.. ఇతర అవసరమైన పరికరాల ధరల పెరుగుదలతో పెరిగిపోయిన కార్ల ధరలు.. ప్రజలను సెకండ్ హ్యాండ్ కార్లవైపు చూసేలా చేస్తోంది. ఫలితంగా ఆన్‌లైన్ సెకండ్ హ్యాండ్ కార్ ప్లాట్‌ఫామ్‌లైన డ్రూమ్, ఓఎల్ఎక్స్, కార్స్ 24 లో ఆన్‌లైన్ లావాదేవీలు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 25% పెరిగాయి. అయితే, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు కూడా పెరుగుదల నమోదు చేస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ ఇప్పుడు 5 నుండి 10%వరకు ఖరీదైనదిగా మరింది.
ఏప్రిల్‌లో కార్ల డిమాండ్ 10,000 యూనిట్లు..
డ్రూమ్ వ్యవస్థాపకుడు.. CEO అయిన సందీప్ అగర్వాల్, ఏప్రిల్- ఆగస్టు మధ్య, సెకండ్ హ్యాండ్ కార్ల డిమాండ్ రాకెట్ వేగం వలె పెరిగిందని చెప్పారు. దీని మార్కెట్ ఏప్రిల్‌లో 130 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 958 కోట్లు), ఇది ఆగస్టులో 165 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ .1216 కోట్లు) పెరిగింది.
యూనిట్ల పరంగా మాట్లాడుతూ, సెకండ్ హ్యాండ్ కారు 7,500 యూనిట్ల నుండి 10 వేల యూనిట్లకు పెరిగింది. డ్రూమ్ ప్లాట్‌ఫారమ్‌లో, ఈ సంఖ్య ఏప్రిల్‌లో 9 లక్షల యూనిట్ల నుండి 10.1 లక్షల యూనిట్లకు పెరిగింది. సెకండ్ హ్యాండ్ కార్ల ధర 5 నుండి 10%పెరిగినప్పటికీ, ఈ కార్లలో మంచి బేరసారాలకు ఇంకా స్థలం ఉంది.
సెకండ్ హ్యాండ్ కార్లలో ఆల్టోకు ఎక్కువ డిమాండ్..
OLX ఆటో సీఈఓ అమిత్ కుమార్ సెకండ్ హ్యాండ్ కార్లలో మారుతీ ఆల్టోకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. సెకండ్ హ్యాండ్ కార్లలో ప్రజలు అత్యధికంగా అమ్ముడైన మోడల్స్‌గా ఉండే కార్లకే ప్రాధాన్యతనిస్తున్నారు. 2021 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 2022 రెండవ త్రైమాసికంలో, ఆల్టో 800 అమ్మకాలు 55%, స్కార్పియో 42%, సెంట్రో 37%, వ్యాగన్ఆర్ 23% విక్రయాలను నమోదు చేశాయి. ఈ కార్ల విక్రయ మోడల్ ధర 3 నుండి 10%వరకు పెరిగింది.
మరింత పెరుగుతుంది..
CARS24 సీఈఓ కునాల్ పాత కార్లను విక్రయించడం గురించి మాట్లాడుతూ, ఆటో పరిశ్రమకు అవసరమైన చిప్ అందుబాటులో లేకపోవడం కొత్త కార్లను ఖరీదుగా మార్చింది. అందుకే ఉపయోగించిన కార్ల అమ్మకాలు క్రమేపీ పెరుగుతున్నాయి. భారతదేశంలో పండుగ సీజన్ లో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. కొత్త కార్ డీలర్లు ఇప్పటికే కేవలం 25 రోజుల స్టాక్ మాత్రమే ఉందని చెప్పారని, ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో ఇది మరింత తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో వినియోగదారులు తప్పనిసరిగా ఉపయోగించిన కార్లను కొనడానికి ముందుకు వస్తారని భావిస్తున్నట్టు ఆయన వివరించారు.