Upliance AI: ఈ ఏఐ డివైజ్.. మీకు నచ్చినట్టు వంట చేసి పెడుతుంది! ధర ఎంతంటే..
కూరగాయలు కట్ చేయడం, మసాలా దినుసులు మిక్సీ పట్టడం, అదేపనిగా నిల్చొని వంటను చెక్ చేస్తూ ఉండడం... ఇకపై ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఎందుకంటే మీ బదులు ఏఐ డిజైజ్.. మీ వంట అంతా చేసిపెడుతుంది. ఇది ఇండియాలోనే మొదటి ఏఐ కుకింగ్ అసిస్టెంట్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

రోజురోజుకీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంతలా అప్‌డేట్ అవుతుందంటే అది వంటగదిలోకి ప్రవేశించింది. ఐటెమ్ పేరు చెప్తే.. ఆటోమెటిక్ గా వంట పూర్తి చేసేలా సరికొత్త ఏఐ డివైజ్ మార్కె్ట్లోకి వచ్చింది. అప్లయెన్స్ ఏఐ (Upliance.ai) అనే స్మార్ట్ కుకింగ్ అసిస్టెంట్.. కూరగాయల కటింగ్ నుంచి గ్రైండింగ్, బాయిలింగ్, ఫ్రైయింగ్.. ఇలా అన్ని వంట పనులు చేసేస్తుంది. దీని గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసకుందాం.
మొబైల్ రిమోట్ ద్వారా
ఈ డివైజ్ వంట చేయడమే కాకుండా వంటలో సహాయం కూడా చేస్తుంది. ఒకవేళ మీరే వంట చేయాలి అనుకుంటే ఆ వంటలో ఏమేం వేయాలో, ఎంత వేయాలో కూడా ఖచ్చితంగా చెప్తుంది. లేదా మీరు మాన్యువల్‌గా కూడా వంట చేసుకోవచ్చు. ఇందులో వర్చువల్ ఫ్లేమ్ వ్యవస్థ ఉంటుంది. చిన్న చిన్న ఇన్‌పుట్స్ ద్వారా వంటను ఈజీగా పూర్తి చేయొచ్చు. అంతేకాదు ఈ డివైజ్‌ను మొబైల్‌కు కనెక్ట్ చేసుకుని మొబైల్ యాప్ ద్వారా బెడ్ రూంలో కూర్చొని కూడా వంట చేసుకోవచ్చు. వంట పూర్తవ్వగానే మొబైల్‌కు నోటిఫికేషన్ కూడా పొందొచ్చు.
ఆటో క్లీనింగ్
ఇకపోతే ఈ డివైజ్‌లో పూర్తిగా గాజు పాత్ర అమర్చారు. వంటలో ఏం జరుగుతుందో స్పష్టంగా చూడొచ్చు. అంతేకాదు ఇందులో వంట చేస్తే గిన్నెలు కడిగే బాధ కూడా ఉండదు. దీనికి ఆటో-క్లీనింగ్ సిస్టమ్ ఉంది. పాత్రకు పట్టిన జిడ్డుని బట్టి నీరు, డిష్ వాష్ లిక్విడ్ ఎంత పోయాలి అనేది అదే మీకు తెలియజేస్తుంది. దానికి అనుగుణంగా పోసి మూత మూస్తే దానంతట అదే క్లీన్ అవుతుంది.
ఈ ఏఐ డివైజ్ ఎప్పట్నుంచో అందుబాటులో ఉన్నా ఇందులో సౌత్ ఇండియన్ వంటకాలను రీసెంట్ గానే అప్ డేట్ చేశారు. ప్రస్తుతం ఇందులో 750కి పైగా వంటకాలు లోడ్ అయ్యి ఉన్నాయి. ఈ డివైజ్ ధర సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉంటుంది. త్వరలోనే సబ్ స్క్రిప్షన్ మోడల్ ను కూడా తీసుకురానున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




