Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ 40 స్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాలు.!
40 రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేయడమే కాదు.. 14 రైల్వే స్టేషన్లు పునఃఅభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియలో కూడా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను పునరుద్ధరించేందుకు భారతీయ రైల్వే వేగంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. 40 రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేయడమే కాదు.. 14 రైల్వే స్టేషన్లు పునఃఅభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియలో కూడా ఉన్నాయి. వచ్చే 5 నెలల్లో వీటి పునరాభివృద్ధి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా ఉపాధి కల్పన, మెరుగైన ఆర్థికాభివృద్ధి జరుగుతుందని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
పునరాభివృద్ధి చేయబోయే స్టేషన్లలో భారీ రూఫ్ ప్లాజా, ఫుడ్ కోర్ట్, వెయిటింగ్ లాంజ్, పిల్లల ఆట స్థలం, స్థానిక ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్థలం మొదలైన సౌకర్యాలను ప్రయాణీకులకు అందించనుంది భారతీయ రైల్వే. అభివృద్ధి పనులు రైల్వే స్టేషన్‌ను మెట్రో, బస్సు మొదలైన వివిధ రవాణా మార్గాలతో అనుసంధిస్తాయి. దీనితో పాటు, స్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో ‘దివ్యాంగజన్’ కోసం గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ, ఇతర సౌకర్యాలను స్వీకరించనున్నారు. ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటెలిజెంట్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో స్టేషన్లను అభివృద్ధి చేస్తారు. ప్రయాణికులతో పాటు సామాన్య ప్రజల కోసం స్టేషన్‌లో ‘సిటీ సెంటర్’ వంటి సౌకర్యాలను రైల్వేశాఖ అభివృద్ధి చేస్తుంది.
ఈ స్టేషన్ల పునరాభివృద్ధికి బిడ్డింగ్..
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో ఆనంద్ విహార్ టెర్మినల్‌తో సహా 16 స్టేషన్‌లలో రీడెవలప్‌మెంట్ కోసం రైల్వేశాఖ టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. తాంబరం, విజయవాడ, దాదర్, కళ్యాణ్, థానే, అంధేరి, కోయంబత్తూర్ జంక్షన్, పూణే, బెంగళూరు సిటీ, వడోదర, భోపాల్, చెన్నై సెంట్రల్, ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్, ఆవడి స్టేషన్‌లను పునరాభివృద్ధి చేయనున్నారు. ఈ సంవత్సరంలోనే పైన పేర్కొన్న స్టేషన్ల కోసం వేలం జరగనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని రాణి కమలాపతి స్టేషన్, పశ్చిమ రైల్వేలోని గాంధీనగర్ రాజధాని స్టేషన్, సౌత్ వెస్ట్రన్ రైల్వేలోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ స్టేషన్‌లు అభివృద్ధి చేయబడ్డాయి.. ప్రస్తుతం ప్రయాణీకులకు అందుబాటులోకి కూడా వచ్చాయి.
ఈ సౌకర్యాలు అందుతాయి..
స్టేషన్లకు రెండు వైపుల నుంచి ప్రవేశం ఉంటుంది.. అంటే రైల్వే స్టేషన్ నగరం రెండు వైపులా కలుపుతుంది. ఫుడ్ కోర్ట్, వెయిటింగ్ లాంజ్, పిల్లలు ఆడుకోవడానికి స్థలం కాకుండా, నగరంలోని స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి స్థలం కేటాయించనున్నారు. నగరం మధ్యలో ఉన్న ఈ స్టేషన్లలో ప్రయాణీకులతో పాటు సామాన్య ప్రజల కోసం సిటీ సెంటర్ లాంటి స్థలాన్ని అభివృద్ధి చేస్తారు. అన్ని రవాణా మార్గాలు స్టేషన్‌కు అనుసంధానించబడతాయి. ఆటో, టాక్సీ, బస్టాండ్‌లు ఇంటర్‌కనెక్ట్ చేయబడతాయి. మొత్తం భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. అలాగే వికలాంగుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
ఈ స్టేషన్ల అభివృద్ధి..
అయోధ్య, బిజ్వాసన్, సఫ్దర్‌జంగ్, గోమతీనగర్, తిరుపతి, గయా, ఉద్నా, సోమనాథ్, ఎర్నాకులం, పూరి, న్యూ జల్పైగురి, ముజఫర్‌పూర్, లక్నో (చార్‌బాగ్), దకానియా తలావ్, కోట, జమ్మూతావి, జలంధర్ కాంట్, నెల్లూరు, సబర్మతి, జైపూర్, భువనేశ్వర్, కొల్లాం, ఉదయపూర్ సిటీ, జైసల్మేర్, రాంచీ, విశాఖపట్నం, పుదుచ్చేరి, కాట్పాడి, రామేశ్వరం, మధురై, సూరత్, జోధ్పూర్, చెన్నై ఎగ్మోర్, న్యూ భుజ్ మొదలైనవి ఈ లిస్టులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..