Income tax: ఆదాయపు పన్నుఆదా చేయాలా..? ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు..!
ఆదాయపు పన్ను చెల్లించడం అనేది అర్హత ఉన్న పౌరులందరి ప్రధాన బాధ్యత. పరిమితికి మించి ఆదాయం సంపాదిస్తున్న వారందరూ తప్పనిసరిగా పన్ను కట్టాలి. దీని కోసం ఆ ఏడాది వారు సంపాదించిన ఆదాయం వివరాలు తెలియజేస్తూ ఆదాయపు పన్ను శాఖకు ఇంకమ్ ట్యాక్స్ రిటర్స్న్ (ఐటీఆర్) దాఖలు చేయాలి. అయితే చెల్లింపుదారులు కొత్త, పాత విధానాల్లో పన్ను కట్టవచ్చు. వాటి మధ్య తేడాలు ఏమిటి, ఏ పద్ధతిలో చెల్లిస్తే లాభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Income Tax
2025-26 అసెస్ మెంట్ ఇయర్ (2024-25 ఆర్థిక సంవత్సరం)కు ఐటీఆర్ దాఖలు చేయడం త్వరలో ప్రారంభం కానుంది. దీనికోసం ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ 1,3, 4, 5 ఫారాలను నోటిఫై చేసింది. కాగా.. కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ, మినహాయింపులు, తగ్గింపులు ఉండవు. అలాగే వివిధ పెట్టుబడి పథకాల్లో డబ్బులు పెట్టేవారికి పాత పన్ను విధానం లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఏ విధానాన్ని ఎంపిక చేసుకోవాలో పన్ను చెల్లింపుదారులు నిర్ధారణ చేసుకోవాలి.
తేడాలివే..
- జీతం పొందే వ్యక్తులు, పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో రూ.50 వేల ప్రామాణిక మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 87ఏ రిబేటు వల్ల రూ.7 లక్షల వరకూ పన్ను లేదు. ఎన్పీఎస్ యజమాని సహకారం, ఈపీఎఫ్ వడ్డీ తప్ప మిగిలిన మినహాయింపులు వర్తించవు.
- పాత పన్ను విధానాన్ని పరిశీలిస్తే.. 70కి పైగా మినహాయింపులు, తగ్గింపులు పొందవచ్చు. పీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎల్ఐసీ, ట్యూషన్ ఫీజులు తదితర వాటికి సంబంధించి రూ.1.50 లక్షల వరకూ సెక్షన్ 80సీ కింద తగ్గింపు లభిస్తుంది. వైద్య బీమా ప్రీమియం, ఇంటి రుణవడ్డీకి తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.5 లక్షల వరకూ ఆదాయం ఉంటే సెక్షన్ 87ఏ కింద రాయితీ అందిస్తారు.
ఏది ఎంపిక చేసుకోవాలంటే..
- కొత్త, పాత పన్ను విధానాలు రెండూ మంచివే అయినప్పటికీ తమకు అనువైన దాన్ని ఎంపిక చేసుకోవడం పన్నుచెల్లింపుదారులకు చాలా అవసరం. మినహాయింపులు, తగ్గింపులను క్లెయిమ్ చేయనివారు, హౌసింగ్ రుణాలు లేదా బీమా ప్రీమియాలను చెల్లించని యువ ప్రొఫెషనర్లు, గిగ్ వర్కర్లు, రూ.7 లక్షల కంటే తక్కువ ఆదాయం సంపాదించే వారందరికీ కొత్త పన్ను విధానం చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో పన్ను చెల్లిస్తే డబ్బులు ఆదా అవుతాయి.
- పాత పన్ను విధానంలో కొన్ని రకాల పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద మినహాయింపులు లభిస్తాయి. హెచ్ ఆర్ఏ, హౌసింగ్ రుణాల వడ్డీ, ఆరోగ్య బీమా, విద్యారుణాలకు చెల్లించిన మొత్తాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మినహాయింపులు పొంది, తద్వారా పన్ను భారం తగ్గుతుంది.
