Liquid mutual funds: వడ్డీ రేటు తగ్గింపుతో నో టెన్షన్.. రెట్టింపు ఆదాయం పొందడం ఇలా
ఇటీవల రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన రెపోరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ తాము అందించే రుణాలపై వడ్డీరేటును తగ్గించాయి. ఇది రుణగ్రహీతలకు సంతోషం కలిగించే విషయం. అదే సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ల (ఎఫ్ డీలు)లతో పాటు పొదుపు ఖాతాలకు కూడా వడ్డీరేటు కూడా తగ్గిపోయింది.

ఎఫ్‌డీల్లో వడ్డీ రేట్ల తగ్గింపుతో ఆ పథకంలో పెట్టులానుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి సమయంలో లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి. పొదుపు ఖాతాల కంటే దాదాపు రెట్టింపు రాబడి అందిస్తాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, వాటి ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగుతున్న ధరలు, ఆరోగ్య సమస్యలు, ఇంటి అద్దెలు తదితర కారణాలతో ప్రతి ఒక్కరికీ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో డబ్బులను వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టి, రాబడి సంపాదించడం తప్పనిసరిగా మారింది. ఈ సమయంలోనే ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంతో వడ్డీరేట్లు తగ్గిపోయాయి. ఇది డిపాజిట్ దారుల సంపాదనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు హెచ్ డీఎఫ్ సీలో బ్యాంకులో రూ.50 లక్షలకు పైగా ఉన్న డిపాజిట్లపై వడ్డీని 3.25 శాతం నుంచి 2.75 శాాతానికి తగ్గించారు. మిగిలిన అన్ని బ్యాంకులు కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నాయి.
- లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మన డబ్బును ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు, స్వల్పకాలిన రుణ సాధనాలలో పెట్టుబడి పెడతాయి. వీటి ద్వారా స్థిరమైన రాబడి లభిస్తుంది.
- లిక్విడ్ ఫండ్స్ నుంచి పొదుపు ఖాతాల కంటే ఎక్కువ రాబడి లభిస్తుంది. ప్రస్తుతం పొదుపు ఖాతాలు 2.7 శాతం నుంచి 3.5 శాతం మేర స్వల్ప రాబడిని అందిస్తున్నాయి. ఇదే సమయంలో లిక్విడ్ ఫండ్స్ ద్వారా 6.5 శాతం నుంచి 7.4 శాతం వరకూ రాబడి పొందవచ్చు.
- అత్యవసర సమయంలో లిక్విడ్ ఫండ్స్ నుంచి డబ్బులను చాలా సులభంగా తీసుకోవచ్చు. ఏడు రోజుల తర్వాత ఎలాంటి చార్జీలు లేకుండా అదే రోజు, మరుసటి రోజు పెట్టుబడిని తీసుకోవచ్చు.
- అత్యంత తక్కువ రిస్కుతో స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఉదాహరణకు పొదుపు ఖాతాలో రూ.లక్ష ఉంచితే ఏడాదికి మూడు శాతం వడ్డీ అంటే రూ.మూడు వేలు లభిస్తుంది. అదే డబ్బును లిక్విడ్ ఫండ్స్ లో పెడితే ఏడాదికి రూ.6,800 వరకూ పొందవచ్చు.
- సులభమైన యాక్సెస్, కనీస రిస్క్, అధిక రాబడి అందించడం వీటి ప్రత్యేకత.
- డబ్బులు పెట్టుబడి పెట్టడానికి మంచి మార్గం ఎంపిక చేసుకోవాలనుకునే వారికి లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.








