Silver Prices: వెండి ధరలు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పనిసరి..!
బంగారంకే కాదు.. ఇకపై వెండికి కూడా హాల్ మార్క్ తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు దేశంలో బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. దీని వల్ల నకిలీకి అడ్డుకట్ట పడటంతో స్వచ్చమైన ఆభరణాలను ప్రజలు కొనుగోలు చేయగలుగుతున్నారు. త్వరలో..

Silver Hallmark: ప్రస్తుతం బంగారంకు హాల్‌మార్క్ తప్పనిసరి అనే నిబంధన దేశంలో అమల్లోకి ఉంది. బంగారం స్వచ్చతను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ గతంలోనే తీసుకొచ్చింది. బంగారం కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు హాల్‌మార్కింగ్ నిబంధన ప్రవేశపెట్టింది. అయితే త్వరలో వెండికి కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి కానుంది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వెండి ధరలు పెరుగుతుండటం, కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి కీలక ప్రకటన కేంద్రం నుంచే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్వరలో వెండికి కూడా హాల్ మార్కింగ్
ప్రస్తుతం బంగారంకు పోటీగా వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వెండికి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్ కారణంగా వెండిలో అక్రమాలు చోటుచేసుకోకుండా స్వచ్చత నిర్ధారించేందుకు తప్పనిసరి హాల్ మార్కింగ్ నిబంధన తీసుకురానుంది. దీని వల్ల వెండి కొనుగోలు చేసేటప్పుడు స్వచ్చతను ధ్రువీకరించుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ రూల్ అమలు చేయడానికి ముందు కేంద్రం ఇందుకోసం మౌలిక సదుపాయాలు కల్పించనుంది. హాల్ మార్కింగ్ కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనుంది. ఇవి ఏర్పాటు చేయడం పూర్తైన తర్వాత కొత్త నిబంధన అమలు చేయనుందని తెలుస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) 79వ వ్యవస్థాపక దినోత్సవం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ డైరెక్టర్ సంజయ్ గార్గ్ సిల్వర్‌కు హాల్ మార్కింగ్ తీసుకురావడంపై ప్రకటన చేశారు.
హాల్ మార్కింగ్ అంటే..?
నకిలీ ఆభరణాలు, మోసాలను అరికట్టి ప్రజలకు నాణ్యమైన వస్తువులను అందించేందుకు హాల్ మార్కింగ్ నిబంధన ఉపయోగపడుతుంది. వస్తువు స్వచ్చతను ప్రజలు తెలుసుకోవచ్చు. అలాగే వస్తువుకు బీఐఎస్ లోగో, ప్రత్యేక ఐడీ, ఆభరణాల విక్రేత గుర్తు వంటివి ఉంటాయి. దీని వల్ల కొనుగోలు చేసే ఆభరణాలు ఖచ్చితమైనవని, నకిలీకి కాదని ప్రజలు గుర్తించవచ్చు. ఎలాంటి ఆందోళన లేకుండా వీటిని కొనుగోలు చేయవచ్చు.
వెండి రేట్లకు నో బ్రేక్
దేశంలో వెండి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,72,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో రూ,2,72,00గా కొనసాగుతోండగా.. బెంగళూరులో రూ.2,52,000గా ఉంది. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,52,000 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి రూ.3 లక్షల మార్క్‌కు సిల్వర్ ధర చేరుకునే అవకాశముందని గత కొంతకాలంగా వ్యాపార వర్గాలు అంచనా వస్తున్నాయి.
