Silver Rates: బంగారం బాటలో వెండి..రికార్డు స్థాయిలోధరల పెరుగుదల
భారతదేశంలో బంగారానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో? వెండికి కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. ముఖ్యంగా పూజాసామగ్రికి చాలా మంది వెండిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వెండి కూడా పెట్టుబడి కింద చూడాలని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా వెండి ధర కూడా బంగారం మాదిరి కొత్త రికార్డులను సృష్టిస్తుంది.

ఇటీవల ఎంసీఎక్స్‌లో వెండి ధరలు రికార్డు గరిష్టాన్ని తాకాయి. దాదాపు 3.5 శాతం పెరిగి కిలోకు రూ. 1,05,000 కు చేరుకున్నాయి, అయితే ప్రపంచ ధరలు 12 సంవత్సరాల గరిష్ట స్థాయి అయిన ఔన్సుకు 34.90 డాలర్లకు చేరుకున్నాయి. బలమైన పెట్టుబడిదారుల డిమాండ్, బలహీనపడుతున్న డాలర్, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఈవీ, సౌర రంగాల నుంచి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ ఈ స్థాయి పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ ప్రారంభంలో బంగారంతో పాటు వెండి కూడా ప్రధాన సాంకేతిక నిరోధక స్థాయిలను అధిగమించడంతో మార్కెట్ సెంటిమెంట్‌లో మార్పు కనిపించిందని వివరిస్తున్నారు.
రెండు సంవత్సరాల తర్వాత యూఎస్ డాలర్ కనిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పునరుద్ధరించిన వాణిజ్య యుద్ధ ఆందోళనలు కూడా విలువైన లోహాల ర్యాలీకి ఆజ్యం పోస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. బంగారం-వెండి నిష్పత్తి 107 నుంచి 95కి బాగా పడిపోయిందని బలమైన వృద్ధి సామర్థ్యంతో సాపేక్షంగా తక్కువ విలువ కలిగిన ఆస్తిగా బంగారం కంటే వెండికి పెట్టుబడిదారులు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు సూచిస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వెండి ధరలు దీపావళి నాటికి రూ.1,20,000 చేరుకోవచ్చుని వివరిస్తున్నారు. ఆర్థిక అనిశ్చితి పెరగడం, సేవల రంగంలో సంకోచం, మార్చి 2023 తర్వాత అత్యంత నెమ్మదిగా ప్రైవేట్ ఉద్యోగాల వృద్ధి వంటి కారణాలు నేపథ్యంలో గురువారం బంగారం ధరలు కూడా పెరిగాయి.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.91,300 మరియు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.99,600 వద్ద ఉంది. మూడు శాతం జీఎస్టీతో బంగారం ధరలు ముంబైలో 10 గ్రాములకు రూ.1 లక్షను తిరిగి చేరుకుని రూ.1,02,588 వద్ద ఉన్నాయి. గత కొన్ని నెలల్లో అద్భుతమైన పురోగతి తర్వాత బంగారం ధరలు రాబోయే రెండు నెలల్లో 12-15% తగ్గవచ్చని వివరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం, వెండి పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








