Stock Market: బేరుమన్న స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 5.61 లక్షల కోట్ల సంపద ఆవిరి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) తీవ్రంగా నష్టపోయాయి...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) తీవ్రంగా నష్టపోయాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల, పలు ఖనిజాల(metal) కొరత, రూపాయి పతనంతో సోమవారం BSE సెన్సెక్స్ 1,491 పాయింట్లు తగ్గి అంటే 2.74 శాతం నష్టపోయి 52,843 వద్ద ముగిసింది.NSE నిఫ్టీ 382 పాయింట్లు కోల్పోయి అంటే 2.35 శాతం క్షీణించి 15,863 వద్ద స్థిరపడింది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 130 డాలర్లు దాటింది. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ మిత్రదేశాలు రష్యా చమురు దిగుమతిపై నిషేధంతో చమురు ధరలు పెరిగాయి.
ప్రస్తుతం మన దేశం.. చమురు అవసరాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. దీంతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండడంతో పెట్టుబడిదారుల్లో భయాలు పెరిగాయి. వారు బంగారం, బాండ్లపై పెట్టుబడికి మొగ్గు చూపడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండడం కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 2.37 శాతం క్షీణించింది. స్మాల్ క్యాప్ షేర్లు 2.04 శాతం క్షీణించాయి. నిఫ్టీ బ్యాంక్ 4.28 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.28 శాతం, నిఫ్టీ ఆటో సూచీలు 4.21 శాతం వరకు పడిపోయాయి. అయితే బోగ్గుతో పాటు ఇతర ఖనిజాలకు డిమాండ్ పెరగడంతో నిఫ్టీ మెటల్ 2.10 శాతం పెరిగింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ నిఫ్టీ లూజర్‌గా ఉంది. ఆ స్టాక్ 8.14 శాతం తగ్గి రూ. 828.50కి పడిపోయింది. మారుతీ సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్ కూడా నష్టపోయాయి. BSEలో 860 కంపెనీల షేర్లు పెరగ్గా.. 2,599 కంపెనీల షేర్లు క్షీణించాయి. మార్కెట్ నష్టలతో పెట్టుబడిదారులు 5.61 లక్షల కోట్లు కోల్పోయారు.
Read Also.. పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే కంపెనీ ఆర్థిక పరిస్థితిని ఇలా అంచనా వేయండి..