Air Conditioners: దేశంలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్.. పాత ఏసీల గుడ్‌బై చెప్పేలా కొత్త పాలసీ?
భారతదేశంలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఎండదెబ్బకు బయటకు రావాలంటే భయపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలు మండుతున్న ఎండల నుంచి రక్షణకు ఎయిర్ కండిషనర్స్ (ఏసీ)లను ఆశ్రయిస్తున్నారు. గతంలో సంపన్న వర్గాలకే పరిమితమైన ఏసీలు నేడు మధ్యతరగతి ప్రజల ఇళ్లల్లో కూడా కనిపిస్తున్నాయి.

సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు అంటేనే కొన్ని రోజులకు పాడైపోతాయి. అయితే వేసవి ప్రారంభానికి ముందు చాలా మంది పాత ఎయిర్ కండిషనర్‌ను మారుస్తూ ఉంటారు. అయితే ఇలా మార్చాలనుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మీ వద్ద ఎనిమిది సంవత్సరాల కంటే పాత ఏసీ ఉంటే కొత్తది కొనడం ద్వారా మీరు కొంత ప్రయోజనం పొందవచ్చు. పాత ఏసీలను ఇంధన సామర్థ్యం గల 5-స్టార్ రేటింగ్ ఉన్న మోడళ్లతో భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహక పథకాన్ని పరిశీలిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదన విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చింది. అలాగే ఈ స్కీమ్ ఇంచుమించు వాహన స్క్రాప్ విధానంలా ఉంటుంది.
ప్రోత్సహకాలు ఇవే
- వినియోగదారులు తమ పాత ఏసీలకు రీసైక్లర్లకు విక్రయించి, సర్టిఫికెట్ పొందవచ్చు. అలాగే కొత్త 5 స్టార్ ఏసీలను కొనుగోలు చేయడం ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు.
- ఏసీ తయారీ కంపెనీల నుంచి ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను ఇవ్వవచ్చు.
- విద్యుత్ బిల్లులపై తగ్గింపులు కూడా పొందవచ్చు.
ఈ పథకం నాన్-స్టార్ ఏసీలను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ 5 స్టార్ మోడళ్లతో భర్తీ చేయడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీమ్ 5 స్టార్ ఏసీల కొనుగోలును పెంచుతుంది. బ్లూ స్టార్, గోద్రేజ్, హావెల్స్ (లాయిడ్స్), ఎల్జీ, వోల్టాస్, ఓ’జనరల్, సామ్‌సంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఈ పథకంపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రభుత్వం ఆహ్వానించింది.
దేశంలో పెరుగుతున్న ఎండల కారణంగా చల్లదనం కోసం విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2023-24లో నగరాల్లో గంటకు 500 టెరావాట్ల విద్యుత్తును వినియోగించారు. దేశం మొత్తం వినియోగంలో దాదాపు మూడింట ఒక వంతుగా ఉంది. ఈ విద్యుత్‌లో దాదాపు 25 శాతం విద్యుత్‌ను కేవలం చల్లదనం కోసమే ప్రజలు వినియోగించారు. దేశంలో ఏసీ డిమాండ్ 2021-22లో 84 లక్షల యూనిట్ల నుంచి 2023-24 నాటికి 1 కోటి యూనిట్లకు పెరిగింది. బీఈఈ నివేదిక ప్రకారం 2017-18లో 8 శాతం ఇళ్లలో ఏసీలు ఉన్నాయి. ఇది 2027-28 నాటికి 21 శాతానికి, 2037-38 నాటికి 40 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి