Recharge Rates: దేశంలో టెలికాం కంపెనీలు రీచార్జ్ ధరలను పెంచనున్నాయి. దాంతో ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దేశంలో 5G సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో.. టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL) మొబైల్ టారిఫ్‌ను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. టారిఫ్‌లు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని, ఈ పెంపు సరైన ఫలితాలను పొందేందుకు, భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది.
గతేడాది కూడా పెరిగిన ధరలు..
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్) గత సంవత్సరంలో డేటా ఛార్జీలను పెంచాయి. ఈ కంపెనీల సగటు ఆదాయం (ARPU) కూడా పెరిగింది. VIL తన తాజా వార్షిక నివేదికలో ఇప్పటికీ తక్కువ టారిఫ్‌లు ఉన్నాయని పేర్కొంది. టెలికాం కంపెనీలు అందిస్తున్న అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌ల కారణంగా ప్రపంచంలో అత్యధిక డేటా వినియోగాన్ని కలిగి ఉన్న దేశాలలో భారతదేశం తొలి స్థానాల్లో ఉండగా, అత్యల్ప టారిఫ్‌లు కలిగిన దేశంగానూ భారత్ టాప్‌లో ఉందని కంపెనీ పేర్కొంది. నిర్ణీత వ్యవధిలో టారిఫ్‌లను పెంచాల్సి ఉంటుందని వీఐఎల్ భావిస్తోంది. తద్వారా ఆపరేట్లరు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, విఐఎల్ మార్చి 31 నాటికి 2,438 మిలియన్ల కస్టమర్‌లను కలిగి ఉంది. అందులో 1,181 మిలియన్లు 4G వినియోగదారులే కావడం విశేషం.
5G ధర ఎంత ఉండనుంది?
హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం దేశంలో 5G ని తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. టెలికాం కంపెనీలు స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద అడ్వాన్స్‌లు కూడా జమ చేశాయి. 5G నెట్‌వర్క్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. అదే సమయంలో 5G నెట్‌వర్క్ కోసం వినియోగదారులు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందనేది ప్రశ్నగా మారింది. టెలికాం రంగ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టెల్కోలు మొదట్లో 5G ధరను కొంచెం ఎక్కువగానే నిర్ణయించే అవకాశం ఉంది. 4G సేవల కంటే 5G ప్లాన్‌లు 10 నుండి 20 శాతం ఎక్కువ ఖర్చు అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..