RBI Fine: మూడు కంపెనీలకు షాకిచ్చిన ఆర్బీఐ.. రూ.46.7 లక్షల జరిమానా.. ఎందుకంటే..
RBI Fine: నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవచ్చని ఆర్‌బిఐ హెచ్చరించింది. అలాగే అన్ని ఆర్థిక సంస్థలు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, అంతర్గత నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయాలని బ్యాంక్ కోరింది. నిబంధనలు ఉల్లంఘించిన మూడు ఫైనాన్స్ కంపెనీలపై జరిమానా విధించింది..

బ్యాంకింగ్ నిబంధనలను పాటించనందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మూడు కంపెనీలపై మొత్తం రూ.46.7 లక్షల జరిమానా విధించింది. వివిధ ఆర్థిక సంస్థలు, కంపెనీలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, ఆడిట్ చేసిన తర్వాత ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. సిటీబ్యాంక్ NA, JM ఫైనాన్షియల్, ఆశిర్వాద్ మైక్రోఫైనాన్స్‌లపై ద్రవ్య జరిమానాలు విధించినట్లు ఫిబ్రవరి 21న బ్యాంక్ విడుదల చేసిన మూడు వేర్వేరు పత్రికా ప్రకటనలలో తెలిపింది.
సిటీబ్యాంక్ NA కి రూ.39 లక్షల జరిమానా:
సిటీబ్యాంక్ NA పై RBI రూ.39 లక్షల జరిమానా విధించింది. మార్చి 31, 2023 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితిని పరిశీలించగా, బ్యాంకు పెద్ద ఎక్స్‌పోజర్ పరిమితి ఉల్లంఘనలను నివేదించడంలో ఆలస్యం చేసిందని, క్రెడిట్ సమాచార సంస్థలకు (CICలు) సకాలంలో డేటాను అందించడంలో విఫలమైందని తేలింది.
జెఎం ఫైనాన్షియల్ కు రూ.1.5 లక్షల జరిమానా:
జేఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్ లిమిటెడ్ పై ఆర్బీఐ రూ.1.5 లక్షల జరిమానా విధించింది. మార్చి 31, 2022, మార్చి 31, 2023 నాటి పరిశీలనలో కంపెనీ తన క్రెడిట్ రిస్క్ గ్రేడింగ్ మెథడాలజీని, వడ్డీ రేట్లలో మార్పుకు గల కారణాలను దాని దరఖాస్తు ఫారమ్‌లు, మంజూరు లేఖలలో స్పష్టంగా వెల్లడించలేదని తేలింది.
ఆశిర్వాద్ మైక్రోఫైనాన్స్ లిమిటెడ్ కు రూ.6.2 లక్షల జరిమానా:
ఆశిర్వాద్ మైక్రోఫైనాన్స్ లిమిటెడ్‌పై RBI రూ.6.2 లక్షల జరిమానా విధించింది. మార్చి 31, 2023 నాటి దర్యాప్తులో కంపెనీ మైక్రోఫైనాన్స్ రుణాలకు సంబంధించిన నియంత్రణ మార్గదర్శకాలను, అంతర్గత అంబుడ్స్‌మన్ నియామకానికి సంబంధించిన నియమాలను పాటించలేదని తేలింది. అదనంగా కొంతమంది కస్టమర్ల కుటుంబ ఆదాయం CICలకు నివేదించబడలేదు. అలాగే కొంతమంది బంగారు రుణ కస్టమర్లకు అవసరమైన వాస్తవ పత్రాలను అందించలేదు.
భవిష్యత్తులో ఏం జరుగుతుంది?
నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవచ్చని ఆర్‌బిఐ హెచ్చరించింది. అలాగే అన్ని ఆర్థిక సంస్థలు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, అంతర్గత నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయాలని బ్యాంక్ కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








