Indian Railways: రైల్వే స్టేషన్లలో ఉచిత వెయిటింగ్ రూమ్స్.. ఎన్ని గంటల వరకు ఉండొచ్చంటే..?
Indian Railway Rules: రైల్వేశాఖ ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఉచిత వెయిటింగ్ హల్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. రిజర్వేషన్ లేదా ఆర్‌ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రధాన స్టేషన్లలో ఈ హల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

దేశంలో ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. రైలు ప్రయాణం చేసే సమయంలో చాలాసార్లు రైలు రావడం ఆలస్యమవుతుంది. ఇలాంటి సమయంలో ఫ్లాట్ ఫామ్ మీద ఎక్కువసేపు నిల్చోని ఉండటం కష్టం. ఇక గర్బిణులు, పిల్లలు, వృద్దులకు ఇలాంటి సమయంలో ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం చాలా స్టేషన్లలో వెయిటింగ్ రూమ్‌లను రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. తాము ప్రయాణించాల్సిన రైళ్ల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన ప్రయాణికులకు ఈ సౌకర్యం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మీ వద్ద కన్ఫర్మ్డ్ లేదా ఆర్ఏసీ టిక్కెట్ ఉంటే రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌న ఉపయోగించుకోవచ్చు. ట్రైన్ వచ్చే సమయానికి సురక్షితమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి వెయిటింగ్ రూమ్స్ ఉపయోగపడతాయి.
ఎన్ని గంటల ముందు వెయిటింగ్ రూమ్‌లోకి వెళ్లవచ్చు..?
రైల్వే నిబంధనల ప్రకారం ధృవీకరించబడిన లేదా ఆర్ఏసీ టిక్కెట్ ఉన్నవారు తమ రైలు బయలుదేరే సమయానికి సుమారు రెండు గంటల ముందు వెయిటింగ్ రూమ్‌లోకి ప్రవేశించవచ్చు. కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో నాలుగు గంటల ముందు కూడా వెళ్లవచ్చు. ఒకవేళ రైలు రాత్రి ఆలస్యంగా లేదా తెల్లవారుజామున ఉంటే చాలా స్టేషన్లు ప్రయాణీకులను రాత్రంతా వెయిటింగ్ రూమ్‌లో ఉండటానికి కూడా అనుమతిస్తాయి.
ప్రయాణం ముగిసిన తర్వాత ఉండొచ్చా..?
రైలు దిగిన తర్వాత కూడా వెయిటింగ్ రూమ్‌ను ఉపయోగించుకోవచ్చు. గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకున్న తర్వాత సుమారు రెండు గంటల పాటు వెయిటింగ్ రూమ్‌లో ఉండటానికి అనుమతి ఇస్తారు. ఈ సమయంలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవచ్చు తీసుకోవచ్చు. స్టేషన్ నుండి బయలుదేరడానికి సమయం అవసరమైన వారికి ఈ సౌకర్యం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇక స్లీపర్, ఏసీ ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. 3AC, 2AC, లేదా 1AC కన్ఫర్మ్డ్ లేదా RAC టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు కూడా అనేక స్టేషన్లలో ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ రూమ్‌లను ఉపయోగించుకోవచ్చు. ఈ సౌకర్యాలను పొందడానికి టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు పత్రం కూడా అవసరం. ఒకవేళ ప్రయాణికుడు స్టేషన్‌లో 12 గంటలు, 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఉండాల్సి వస్తే IRCTC రిటైరింగ్ రూమ్‌లు లేదా డార్మిటరీ బెడ్‌లను బుక్ చేసుకోవచ్చు.
