దానిపై నో ట్యాక్స్.. ITAT కీలక నిర్ణయం! ఎవరికి ప్రయోజనమంటే?
అహ్మదాబాద్ ఐటీఏటీ తీర్పుతో ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ నిబంధనల్లో కీలక మార్పు వచ్చింది. సెక్షన్ 194-IA కింద రూ.50 లక్షలకు మించిన బహుళ విక్రేత ఆస్తి కొనుగోళ్లపై పన్ను ఉపశమనం లభించింది, ముఖ్యంగా ఏప్రిల్ 1, 2024కి ముందు జరిగిన లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.

రూ.50 లక్షలకు పైగా విలువ కలిగిన ఆస్తుల కొనుగోలుపై 1 శాతం టీడీఎస్ (TDS) మినహాయించడం తప్పనిసరి అనే నిబంధనకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194-IA కింద అమలులో ఉన్న ఈ నియమంపై ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) అహ్మదాబాద్ బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పు పాత లావాదేవీలకు గణనీయమైన ఉపశమనం కల్పించింది.
ఈ కేసు హస్ముఖ్‌భాయ్ జయంతిభాయ్ పటేల్ vs ITOకు సంబంధించినది. ఒక కొనుగోలుదారు పలువురు యజమానుల నుండి రూ.50 లక్షలకు పైగా విలువ కలిగిన ఆస్తిని కొనుగోలు చేసినప్పటికీ, ప్రతి విక్రేతకు చెల్లించిన మొత్తం రూ.50 లక్షల కంటే తక్కువగా ఉండటంతో టీడీఎస్ మినహాయించలేదు. అయితే పన్నుల శాఖ ఈ అంశాన్ని విభిన్నంగా అర్థం చేసుకుని, మొత్తం ఆస్తి విలువను ఆధారంగా తీసుకుని కొనుగోలుదారుని డిఫాల్టర్‌గా ప్రకటించి, సుమారు రూ.13.5 లక్షల పన్ను, వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.
ఈ వివాదంపై విచారణ జరిపిన ITAT, ఆ సమయంలో అమల్లో ఉన్న చట్టాన్ని పరిశీలించి, కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సంబంధిత అసెస్మెంట్ ఇయర్ (AY 2015-16) నాటికి, రూ.50 లక్షల పరిమితిని ప్రతి విక్రేతకు చెల్లించిన మొత్తాన్ని బట్టి లెక్కించాలే తప్ప, మొత్తం ఆస్తి విలువను కలిపి పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కారణంగా కొనుగోలుదారుపై విధించిన పన్ను డిమాండ్‌ను పూర్తిగా రద్దు చేస్తూ అతనికి ఊరట కల్పించింది. అయితే ఈ తీర్పు ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు వర్తించదని స్పష్టం చేయాలి. 2024 ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు మారాయి. ఇప్పుడు మొత్తం ఆస్తి విలువ రూ.50 లక్షలు దాటితే, విక్రేతలు ఎన్ని మంది ఉన్నా టీడీఎస్ మినహాయించడం తప్పనిసరి అయింది. దీంతో పన్ను నియమాలు మరింత కఠినతరం అయ్యాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తి కొనుగోలు చేసే వారు తాజా నిబంధనలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అత్యంత అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
