AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI సేవల వెనుక ఇంత కథ ఉందా? ట్రాన్సాక్షన్లు ఫ్రీ కాదా.. వాళ్లు చెల్లిస్తున్నారా!

టీ కొట్టు దగ్గర రెండు రూపాయల నుంచి టెక్ స్టోర్లలో వేల రూపాయల వరకు.. ఈరోజు మన జేబులో రూపాయి నగదు లేకపోయినా పర్వాలేదు కానీ ఫోన్‌లో ఆ ఒక్క యాప్ ఉంటే చాలు. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవం సృష్టించిన ఆ సేవలే ఇప్పుడు ఒక పెద్ద సందిగ్ధంలో పడ్డాయి.

UPI సేవల వెనుక ఇంత కథ ఉందా? ట్రాన్సాక్షన్లు ఫ్రీ కాదా.. వాళ్లు చెల్లిస్తున్నారా!
Upi
Nikhil
|

Updated on: Jan 20, 2026 | 9:23 AM

Share

ఇప్పటివరకు మనమందరం రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్న ఆ డిజిటల్ లావాదేవీల వెనుక బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయట. మరికొద్ది రోజుల్లో రాబోతున్న 2026 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. మనం ప్రతిరోజూ వాడే ఆ ఉచిత సేవలకు ఇకపై స్వస్తి పలకాల్సిందేనా? యూపీఐ వ్యవస్థను బతికించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతోంది?

యూపీఐ సక్సెస్ వెనుక ఆర్థిక సంక్షోభం..

భారతదేశంలో యూపీఐ ఇప్పుడు కేవలం ఒక చెల్లింపు విధానం కాదు, అది మన జీవనశైలిలో ఒక భాగం. ప్రతి నెలా 2000 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ ఈ విజయానికి వెనుక ఒక కఠిన వాస్తవం దాగి ఉంది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలులో ఉంది. అంటే వ్యాపారులు దీనికోసం ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే ప్రతి లావాదేవీని ప్రాసెస్ చేయడానికి, సైబర్ సెక్యూరిటీని పర్యవేక్షించడానికి బ్యాంకులకు దాదాపు రూ. 2 వరకు ఖర్చు అవుతోంది. ఈ భారాన్ని ప్రస్తుతం బ్యాంకులు, ప్రభుత్వం భరిస్తున్నాయి.

తగ్గుతున్న సబ్సిడీలు – పెరుగుతున్న ఒత్తిడి..

2023-24లో ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల కోసం రూ. 3,900 కోట్ల సబ్సిడీని అందించగా, అది 2025-26 నాటికి కేవలం రూ. 427 కోట్లకు పడిపోయింది. కానీ యూపీఐ వ్యవస్థను సురక్షితంగా నడపాలంటే ఏటా రూ. 8,000 నుండి రూ. 10,000 కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిధుల కొరత వల్ల గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించడం, హ్యాకింగ్ దాడుల నుండి వ్యవస్థను కాపాడుకోవడం ఫిన్‌టెక్ సంస్థలకు కష్టతరంగా మారుతోంది.

ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనలు..

ఈ వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడటానికి ప్రభుత్వం బడ్జెట్ 2026 లో రెండు రకాల మార్గాలను పరిశీలిస్తోంది.

1. పరిమిత ఛార్జీల విధింపు: సాధారణ ప్రజలకు (P2P), చిన్న వ్యాపారులకు యూపీఐని పూర్తిగా ఉచితంగా ఉంచి.. ఏడాదికి రూ. 10 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద కంపెనీలపై 0.25 నుండి 0.30 శాతం వరకు నామమాత్రపు ఫీజు విధించడం. 2. సబ్సిడీల పెంపు: ఇతర రంగాలకు కేటాయించే నిధులను తగ్గించి అయినా, యూపీఐ కోసం వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించడం.

సామాన్యుడిపై ప్రభావం..

ఒకవేళ ఫీజులు విధించినా, అవి సామాన్యుల రోజువారీ చిన్న లావాదేవీలపై ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పెద్ద కార్పొరేట్ సంస్థలు, భారీ వాల్యూమ్ కలిగిన లావాదేవీలపై మాత్రమే ఈ ప్రభావం ఉండవచ్చు. అయితే డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచాలంటే ఎవరో ఒకరు ఆ భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఏర్పడింది. యూపీఐ భారతదేశ గర్వకారణం. ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసేలా చేసిన ఈ అద్భుత వ్యవస్థను మరింత పటిష్టం చేయాలంటే ఆర్థికంగా అది నిలబడాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం డిజిటల్ ఇండియా భవిష్యత్తును నిర్ణయించబోతోంది.