LIC Policy: రోజు రూ.45 పొదుపుతో 35 ఏళ్లకు రూ.25 లక్షలు.. ఎల్‌ఐసీలో ఈ అద్భుత పాలసీ గురించి మీకు తెలుసా.. ?
డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఎల్‌ఐసీలో అనేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. డబ్బులు పొదుపు చేసుకోవడమే కాకుండా ప్రమాద బీమా వంటివి ఇందులో లభిస్తాయి. ఎల్‌ఐసీలో పాపులర్ అయిన పాలసీల్లో జీవన్ ఆనంద్ ఒకటి. అసలు ఈ పాలసీ వివరాలు ఏంటో చూద్దాం.

LIC Jeevan Anand Policy: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ అయిన ఎల్‌ఐసీ గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. ఎల్‌ఐసీలో పాలసీ తీసుకోవాల్సిందిగా మీ ఇంటికి వచ్చి ఏజెంట్లు కోరిన సందర్భాలు మీరు చూసే ఉంటారు. ఇతర ప్రైవేట్ బీమా సంస్థలు ఉన్నప్పటికీ.. భారత్‌లో నమ్మకమైన బీమా సంస్థగా ఎల్‌ఐసీకి మంచి పేరుంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఎల్‌ఐసీలో పాలసీలు కలిగి ఉన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం చాలామంది ఎల్‌ఐసీలో ఉండే వివిధ స్కీమ్‌లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇక కొంతమంది తమ పిల్లల పేరుపై పాలసీలు ఓపెన్ చేసి డబ్బులు పొదుపు చేస్తూ ఉంటారు. కస్టమర్ల కోసం ఎల్‌ఐసీ అనేక పాలసీలు ప్రవేశపెడుతోంది. పిల్లలు, వృద్దుల కోసం ప్రత్యేక పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్నింటి కంటే బాగా పాపులర్ అయిన జీవన్ ఆనంద్ పాలసీ గురించి తెలుసుకుందాం.
జీవన్ ఆనంద్ పాలసీ ఎందుకు ప్రత్యేకం
జీవన్ ఆనంద్ పాలసీలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి వస్తుంది. బీమా కవరేజీతో పాటు పొదుపు ప్రయోజనాలు, మోచ్యూరిటీ రాబడి ఎక్కువగా ఉంటుంది. పిల్లల నుంచి సీనియర్ సిటిజన్లు వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు.
బోనస్
ఈ పాలసీలో మీరు 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే బోనస్ ప్రయోజనం ఉంటుంది. పాలసీలోని మొత్తం సొమ్ముతో సంబంధం లేకుండా బోనస్ ప్రత్యేకంగా ఉంటుంది. దీని వల్ల మీరు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు.
రోజుకు రూ.45తో రూ. 25 లక్షల రాబడి
ఉదాహరణకు మీరు ఈ పాలసీలో రోజుకు రూ.45 పెట్టుబడి పెట్టారనుకుందాం. అంటే నెలకు రూ.1358 పెట్టుబడి పెడుతున్నట్లు లెక్క. మీరు అలా 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే అది రూ.5,70,500 అవుతుంది. పాలసీ కాల వ్యవధి ముగిశాక మీకు రూ.5 లక్షలతో పాటు రూ.8.60 లక్షల రివిజనరీ బోనస్, రూ.11.50 లక్షల తుది బోనస్ వస్తుంది.అంటే వీటిని కలుపుకుంటే మీకు మొత్తం రూ.25 లక్షల వరకు వస్తాయి. 15 ఏళ్ల కంటే ఎక్కువ వ్యవధి గల పాలసీదారులు మాత్రమే ఈ బోనస్‌లను అందుకుంటారు.
అదనపు ప్రయోజనాలు
ఇక జీవన్ ఆనంద్ పాలసీలో అదనపు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ప్రమాదవశాత్తూ పాలసీదారుడు కాల వ్యవధి కంటే ముందే మరణిస్తే నామినీకి 125 శాతం డెత్ బెనిఫిట్స్ కింద వస్తుంది. ఇక క్రిటికల్ బెనిఫిట్, అంగవైకల్యం, కొత్త టర్మ్ ఇన్స్యూరెన్స్ రైడ్ వంటి బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి.




