
ఈపీఎఫ్‌వో విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పలు నిబంధనలు, నియమాల్లో మార్పులకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఉన్న పథకాల్లో ఒకేసారి భారీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995 పథకాలు ఉండగా.. వీటి స్థానంలో కొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రెండింటి స్థానంలో ఈపీఎఫ్-2026, ఈపీఎస్-2026 పథకాలను అమల్లోకి త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీన కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ పథకాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలిపారు. కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేయాలని నిర్ణయించారు.
కొత్త పథకాలపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకాల రాకతో ఈపీఎఫ్‌వో విత్ డ్రాలు, పింఛన్ ఖరారు, ఉద్యోగి, యజమాని వాటా వంటి పలు విషయాల్లో నూతన మార్పులు చేసింది. రూల్స్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. యజమాని వాటాను ఉద్యోగి జీతం నుంచి కట్ చేయకూడదని కొత్త రూల్ తీసుకొచ్చింది. అలాగే ఈ వాటాను ఉద్యోగి నుంచి వెనక్కి తీసుకోకూడదని తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈపీఎఫ్‌వో హెచ్చరించింది. మరోవైపు పీఎఫ్‌లో కనీస నిల్వ 25 శాతం ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన 75 శాతాన్ని ఎప్పుడైనా ఉద్యోగులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ 25 శాతాన్ని ఉద్యోగం మానేశాక ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పటివరకు కనీస నిల్వ ఉండాలనే నిబంధన లేకపోగా.. ఇప్పుడు ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు.
-అనారోగ్య కారణాలతో ఏడాదికి మూడుసార్లు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవచ్చు
-విద్య కోసం సర్వీసులో మొత్తం పది సార్లు పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉససంహరించుకోవచ్చు
-వివాహం కోసం ఐదుసార్లు క్లెయిమ్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు
-ఇంటి నిర్మాణం, ఇల్లు కొనాలన్నా, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి పున:నిర్మాణ అవసరాల కోసం సర్వీసులో ఐదుసార్లు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి కల్పించారు
-ఇప్పటివరకు ఇంటి అవసరాల కోసం రెండుసార్లు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 5సార్లకు పెంచారు.
-కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏడాది సర్వీస్ పూర్తి కాకపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చు
-ఉద్యోగి దేశం విడిచి వెళ్లిపోయినా, 55 ఏళ్లు దాటినా, ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసినా, ఉద్యోగం నుంచి తీసివేసినా మిగిలిన 25 శాతాన్ని కూడా ఎప్పుడైనా పొందవచ్చు