Parle-G: ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న సీక్రెట్ ఇదే..
గత ముప్పై ఏళ్లలో పెట్రోల్ నుంచి పాల వరకు అన్నింటి రేట్లు నాలుగైదు రెట్లు పెరిగిపోయాయి. కానీ ఇప్పటికీ కేవలం రూ.2, రూ.5 పెడితే కడుపు నింపే ఏకైక బ్రాండ్ ఏదైనా ఉందంటే అది పార్లే జి మాత్రమే. అసలు నిత్యావసరాల ధరలు ఇంతలా పెరిగినా.. పార్లే-జి ధర ఎందుకు పెరగలేదు? ధర పెంచకుండానే కంపెనీ వేల కోట్ల రూపాయల లాభాలను ఎలా గడిస్తోంది? ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ వెనుక ఉన్న ఆ బిజినెస్ మ్యాజి తెలుసుకుందాం..

చాయ్ తాగే ప్రతి ఒక్కరికీ పార్లే-జి బిస్కెట్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. దేశంలో పెట్రోల్, పాలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకినా.. దశాబ్దాలుగా పెద్దగా ధర పెరగని ఏకైక వస్తువు పార్లే-జి. 1994 నుంచి పార్లేజీ బిస్కెట్ ధరలో మాత్రం పెద్దగా మార్పుల్లేవు. రూ.2, రూ.5 కే ఇప్పటికీ ఈ బిస్కెట్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. గోధుమలు, చక్కెర, నూనె ధరలు విపరీతంగా పెరిగినా పార్లే-జి ధర ఎందుకు పెరగలేదు? ధర పెంచకుండా కంపెనీ నష్టపోకుండా ఎలా నిలబడింది..? ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్‌గా ఎదిగిన పార్లే-జి అమలు చేసిన జీనియస్ బిజినెస్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రింక్‌ఫ్లేషన్ మాయాజాలం..
పార్లే-జి ధరను పెంచకుండా కంపెనీ ఉపయోగించిన అతిపెద్ద అస్త్రం శ్రింక్‌ఫ్లేషన్. అంటే ధరను అలాగే ఉంచి.. ప్యాకెట్ పరిమాణాన్ని క్రమంగా తగ్గించడం. 1994లో రూ.4 కు లభించే ప్యాకెట్ బరువు దాదాపు 100 గ్రాములు. ముడిసరుకుల ధరలు పెరిగేకొద్దీ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ ధరను పెంచలేదు. దానికి బదులుగా బరువును 92.5 గ్రాములకు, ఆ తర్వాత 82.5 గ్రాములకు, ఆపై 65 గ్రాములకు, ప్రస్తుతం దాదాపు 55 గ్రాములకు తగ్గించింది. సామాన్య ప్రజలు లేదా కూలీలు జేబులోంచి రూ.5 నాణెం తీసి బిస్కెట్ కొనే మానసిక స్థితిని కంపెనీ కాపాడుతూ వచ్చింది. గ్రాములు తగ్గిన విషయం కస్టమర్‌కు పెద్దగా భారంగా అనిపించదు.
ఒకసారి రేటు పెంచి నేర్చుకున్న చేదు పాఠం..
పార్లే కంపెనీ ఒకసారి రూ.5 ప్యాకెట్ ధరను రూ.5.50 లేదా రూ. 6 చేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో అమ్మకాలు భారీగా పడిపోయాయి. భారతదేశంలో రూ.5 అనేది ఒక ఫిక్స్‌డ్ కాయిన్ కరెన్సీ. టీ కొట్టు దగ్గర చాయ్ తాగే వ్యక్తి జేబులోంచి చిల్లర తీసి రూ. 5 ఇచ్చి సులువుగా కొనేస్తాడు. అదే రూ. 6 చేస్తే చిల్లర సమస్య రావడం, ప్రత్యామ్నాయ బ్రాండ్ల వైపు జనం చూడటం మొదలైంది. దీంతో భారతీయుల కొనుగోలు మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న కంపెనీ.. “ధరను మార్చకూడదు, బరువునే సర్దుబాటు చేయాలి” అనే నిర్ణయానికి కట్టుబడింది.
లాభం తక్కువ.. అమ్మకాలు భారీ
పార్లే-జి ప్రతి ప్యాకెట్‌పై వచ్చే లాభం పైసల్లోనే ఉంటుంది. కానీ కంపెనీ బలమంతా భారీ అమ్మకాల పైనే ఆధారపడి ఉంది. భారతదేశంలో ప్రతీ సెకనుకు దాదాపు 4,000 పైగా పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడవుతాయని ఒక అంచనా. నెలకు దాదాపు 100 కోట్లకు పైగా ప్యాకెట్లు మార్కెట్లోకి వెళ్తాయి. ఒక్క ప్యాకెట్‌పై 10 పైసలు లేదా 20 పైసలు లాభం వచ్చినా.. వందల కోట్ల ప్యాకెట్లు అమ్ముడైనప్పుడు అది కంపెనీకి వేల కోట్ల రూపాయల వార్షిక నికర లాభాన్ని తెచ్చిపెడుతుంది.
లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ – రవాణా ఖర్చుల తగ్గింపు
బిస్కెట్లు తేలికగా ఉంటాయి కానీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఒకే ఫ్యాక్టరీలో తయారుచేసి దేశమంతా లారీల్లో పంపితే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే పార్లే కంపెనీ దేశవ్యాప్తంగా దాదాపు 100 కంటే ఎక్కువ కాంట్రాక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఏ ప్రాంతంలో బిస్కెట్లు అవసరమో, దానికి అత్యంత సమీపంలోనే తయారుచేసి స్థానిక మార్కెట్లకు పంపుతుంది. దీనివల్ల డీజిల్, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు భారీగా ఆదా అవుతాయి.
పార్లే-జి కేవలం బిస్కెట్ మాత్రమే కాదు.. సామాన్యుడి ఎమోషన్. తెల్లవారుజామున పనిచేసే కార్మికుడి నుంచి హాస్టల్ రూమ్‌లో ఉండే స్టూడెంట్ వరకు అందరికీ ఆకలి తీర్చే బడ్జెట్ స్నాక్. ఎలాంటి ఆర్భాటం లేని ఎల్లో కలర్ ప్యాకింగ్, ఆ చిన్నారి పాప బొమ్మను దశాబ్దాలుగా మార్చకుండా కొనసాగించడం వల్ల మార్కెట్లో అచంచలమైన నమ్మకం ఏర్పడింది.
