ఒక టికెట్ కన్ఫర్మ్.. ఇంకోటి వెయిటింగ్ లిస్ట్.. ఇప్పుడు రెండో వ్యక్తి రైలు ఎక్కొచ్చా..? ఈ రూల్స్ తెలుసుకోండి
భార్యాభర్తలిద్దరూ కలిసి ఊరెళ్లడానికి ఒకే PNRపై రెండు ఆన్‌లైన్ రైలు టిక్కెట్లు బుక్ చేశారు. చార్ట్ వచ్చేసరికి ఒకరిది కన్ఫర్మ్ అయింది.. మరొకరిది మాత్రం వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోయింది.. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు రైలు ఎక్కవచ్చా? టీటీఈ పట్టుకుంటే జరిమానా వేస్తారా లేక రైలు దింపేస్తారా? ఆన్‌లైన్ టిక్కెట్లపై రైల్వే శాఖ అమలు చేస్తున్న రూల్స్ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.

రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అతి పెద్ద గందరగోళం ఇది. ఉదాహరణకు.. మీరు మీ భార్యతోనో లేదా కుటుంబ సభ్యులతోనో కలిసి ఒకే PNRపై రెండు లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు బుక్ చేశారనుకుందాం. చార్ట్ సిద్ధమయ్యే సమయానికి అందులో ఒక టికెట్ కన్ఫర్మ్ అయి, మరొక టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోయింది. సాధారణంగా ఆన్‌లైన్ వెయిటింగ్ టిక్కెట్లు ఆటోమేటిక్‌గా రద్దయిపోతాయని అందరికీ తెలుసు. మరి ఇలాంటి సందర్భంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తి మీతో కలిసి ప్రయాణించవచ్చా..? టీటీఈ జరిమానా విధిస్తారా? దీనిపై భారతీయ రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వెయిటింగ్ టిక్కెట్లపై సాధారణ నిబంధన ఏంటి?
సాధారణంగా ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసిన టిక్కెట్‌లో ప్రయాణికులందరి పేర్లు వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోతే, చార్ట్ తయారైన తర్వాత ఆ టికెట్ పూర్తిగా ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. ఆ మొత్తం డబ్బు ప్రయాణికుడి బ్యాంక్ ఖాతాకే రీఫండ్ అవుతుంది. అలాంటి రద్దయిన ఈ టికెట్‌పై ప్రయాణించడానికి అనుమతి ఉండదు. జనరల్ టిక్కెట్ తీసుకున్నా సరే.. స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వీలు లేదు. చెల్లుబాటు అయ్యే టిక్కెట్ లేకుండా రిజర్వ్‌డ్ బోగీల్లో ప్రయాణిస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ 155 కింద టీటీఈలు జరిమానా విధించడమే కాకుండా రైలు నుంచి దించేసే అధికారం కలిగి ఉంటారు. అయితే కౌంటర్ టిక్కెట్ విషయంలో మాత్రం వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పటికీ సంబంధిత క్లాస్‌లో ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది.
ఒకే PNRలో ఒకరికి కన్ఫర్మ్.. మరొకరికి వెయిటింగ్ ఉంటే?
ఇక్కడే రైల్వే ఒక ప్రత్యేక వెసులుబాటును కల్పించింది. దీనిని రైల్వే పరిభాషలో పార్షియల్లీ కన్ఫర్మ్డ్ టిక్కెట్ అంటారు. ఒకే PNR నంబర్‌పై ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండి, అందులో కనీసం ఒక్కరి టికెట్ కన్ఫర్మ్ అయినా , మిగిలిన వారి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు కావు. వారు ప్రత్యేకంగా ఎలాంటి జనరల్ టిక్కెట్ కొనాల్సిన అవసరం లేకుండానే కన్ఫర్మ్ అయిన ప్రయాణికుడితో కలిసి అదే కోచ్‌లో ప్రయాణించవచ్చు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నందుకు టీటీఈ ఎలాంటి పెనాల్టీ లేదా జరిమానా విధించరు. అయితే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తికి ప్రత్యేక బెర్త్ కేటాయించడం అనేది ఆ బోగీలో సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఖాళీలు ఉంటే టీటీఈ అదనపు బెర్త్ కేటాయిస్తారు, లేదంటే కన్ఫర్మ్ అయిన ఒక్క బెర్త్‌నే ఇద్దరూ సర్దుబాటు చేసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రముఖ టీటీఈ జితేంద్ర మిశ్రా కూడా సోషల్ మీడియాలో ఇదే నిబంధనను వివరించారు.
ఆటోమేటిక్ రీఫండ్ రాదు.. గుర్తుంచుకోవాల్సిన నిబంధన!
ఈ రూల్‌లో ప్రయాణికులు అత్యంత ముఖ్యంగా గమనించాల్సిన అంశం రీఫండ్. గతంలో చాలామంది ప్రయాణికులు ఇలాంటి పార్షియల్ టికెట్లపై కలిసి ప్రయాణించి, అనంతరం వెయిటింగ్ లిస్ట్ టికెట్‌పై ఆన్‌లైన్ ద్వారా రీఫండ్ కూడా క్లెయిమ్ చేసేవారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే నిబంధనలను సవరించింది. మీరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తిని ప్రయాణానికి తీసుకెళ్లినా, తీసుకెళ్లకపోయినా ఆ రెండో టికెట్ డబ్బులు ఆటోమేటిక్‌గా రీఫండ్ కావు. ఒకవేళ ఒకరి టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కారణంగా మీరిద్దరూ ప్రయాణం విరమించుకోవాలనుకుంటే.. చార్ట్ ప్రిపేర్ కావడానికి నిర్ణీత సమయం ముందే టికెట్‌ను పూర్తిగా క్యాన్సిల్ చేయాలి లేదా నిబంధనల ప్రకారం TDR ఫైల్ చేసి మాత్రమే రీఫండ్ పొందాల్సి ఉంటుంది.
View this post on Instagram
