Gas Cylinder: గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..
గ్యాస్ కొరత నేపథ్యంలో కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ఉండగా.. ఇందులో ఇక నుంచి 10 కిలోల ఎల్పీజీా మాత్రమే నింపుతారని తెలుస్తోంది.

దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోవడం, డెలివరీలో జాప్యం జరగుతుండటంతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాణిజ్య సిలిండర్ల లభ్యత లేకపోవడంతో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ఆహార పదార్ధాల దుకాణాలు మూతపడగా.. కొన్ని స్టాల్స్ ధరలను పెంచి విక్రయిస్తున్నాయి. దీంతో సామాన్యులపై భారం పడుతుంది. పరిస్థితి చక్కబడటానికి మరికొద్ది నెలల సమయం పట్టే అవకాశముంది. యుద్దం ముగిసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటేనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నాయి.
ఇక నుంచి 10 కేజీల సిలిండర్..!
గ్యాస్ కొరత క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు కొరతను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా 10 కిలోల డొమెస్టిక్ సిలిండర్ తీసుకొచ్చేందుకు యోచిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగించే గృహ సిలిండర్ 14.2 కిలోలు ఉండగా.. దీనిని 10 కిలోలకు తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చేసేందుకు ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. పాత సిలిండర్లలోనే 10 కేజీల ఎల్పీజీ నింపి అందించనున్నారని తెలుస్తోంది. దీని ద్వారా గ్యాస్ కొరత తగ్గడంతో పాటు అందరికీ గ్యాస్ అందుతుందని కంపెనీలు భావిస్తోన్నాయి. త్వరలోనే దీనిని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే మనం 10 కేజీల ఎల్పీజీని చూడవచ్చు.
ధర తగ్గింపు..?
ఒకవేళ సిలిండర్‌లో నింపే గ్యాస్‌ను తగ్గిస్తే ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకోసం రెగ్యూలేటరీ అనుమతులు పొందాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నాయి. 14.2 కిలోల సిలిండర్ సగటున ఒక కుటుంబానికి 35 నుంచి 40 రోజుల పాటు వస్తోంది.అదే 10 కిలలో సిలిండర్ అయితే ఒక నెల పాటు వస్తుంది. గ్యాస్ అందరికీ అందించేందుకు చమురు కంపెనీలు ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నాయి. ఇక సిలిండర్ బరువును తగ్గిస్తే.. లేబుల్ మార్చాల్సి ఉంటుంది. ఇక రీఫిల్లింగ్ వ్యవస్థలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రతిపాదనల దశలో ఉండగా.. చమురు కంపెనీలు ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తాయనేది హాట్‌టాపిక్‌గా మారింది. హార్ముజ్ జలసంధి ద్వారా గ్యాస్ సరఫరా ఎక్కువగా జరుగుతుంది. కానీ యుద్దం క్రమంలో రవాణాలో అంతరాయం కలుగుతోంది.
