AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E20 పెట్రోల్‌లో కల్తీ ఉందా? 90 వేల బంకుల్లో తనిఖీలు.. బయటపడ్డ అసలు నిజం!

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై కొనసాగుతున్న అనుమానాలు, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక ప్రకటన చేశాయి. E20 పెట్రోల్‌లో అధిక స్థాయిలో క్లోరైడ్, నీటి కల్తీ జరుగుతోందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు, పరీక్షలు నిర్వహించామని అయిల్ కంపెనీలు ప్రకటించాయి.

E20 పెట్రోల్‌లో కల్తీ ఉందా? 90 వేల బంకుల్లో తనిఖీలు.. బయటపడ్డ అసలు నిజం!
E20 Petrol
Balaraju Goud
|

Updated on: Aug 08, 2026 | 8:21 AM

Share

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై కొనసాగుతున్న అనుమానాలు, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక ప్రకటన చేశాయి. E20 పెట్రోల్‌లో అధిక స్థాయిలో క్లోరైడ్, నీటి కల్తీ జరుగుతోందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు, పరీక్షలు నిర్వహించామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వెల్లడించాయి. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కల్తీ జరుగుతోందన్న ఆరోపణలకు ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేశాయి.

రిఫైనరీల నుంచి 100కు పైగా నమూనాలు

పెట్రోల్ ఉత్పత్తి దశ నుంచే నాణ్యతను పరిశీలించేందుకు దేశంలోని వివిధ రిఫైనరీల నుంచి 100కు పైగా పెట్రోల్ నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షించగా క్లోరైడ్ స్థాయులు 1 పీపీఎం లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. అంటే రిఫైనరీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్న పెట్రోల్ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

80 డిస్టిలరీల్లో ఇథనాల్ పరీక్ష

E20లో కీలకమైన ఇథనాల్ నాణ్యతను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు. దేశవ్యాప్తంగా సుమారు 80 డిస్టిలరీల నుంచి ఇథనాల్ నమూనాలను సేకరించి పరీక్షించినట్లు కంపెనీలు తెలిపాయి. వీటిలో క్లోరైడ్ స్థాయులు 3 పీపీఎం కంటే తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో ఇథనాల్ నుంచే అధిక క్లోరైడ్ E20లోకి చేరుతోందన్న అనుమానాలకు ప్రస్తుత పరీక్షల్లో ఆధారం కనిపించలేదని కంపెనీలు పేర్కొన్నాయి.

డిపోలు, టెర్మినళ్ల వద్ద తనిఖీలు

రిఫైనరీల నుంచి బయటకు వచ్చిన తర్వాత పెట్రోల్ నాణ్యతను డిపోలు, టెర్మినళ్ల వద్ద కూడా పరీక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా 80కి పైగా నమూనాలను పరిశీలించగా క్లోరైడ్ స్థాయులు నిర్దేశిత పరిమితుల్లోనే ఉన్నట్లు తేలిందని చమురు సంస్థలు వెల్లడించాయి. అంటే ఉత్పత్తి నుంచి నిల్వ, రవాణా దశ వరకు ఇంధన నాణ్యతపై పర్యవేక్షణ కొనసాగుతోందని స్పష్టం చేశాయి.

వెయ్యికి పైగా పెట్రోల్ పంపుల నమూనాలు

అసలు కల్తీ జరిగే అవకాశం ఉందని ఆరోపణలు వస్తున్న పెట్రోల్ పంపులపైనా కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,000కు పైగా నమూనాలను సేకరించినట్లు తెలిపాయి. తాజాగా పరీక్షించిన 160 నమూనాల్లో క్లోరైడ్ స్థాయులు 0 నుంచి 3 పీపీఎం మధ్య ఉన్నట్లు వెల్లడించాయి. అయితే నాలుగు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక క్లోరైడ్ స్థాయులు గుర్తించినట్లు కంపెనీలు అంగీకరించాయి. ఆయా ప్రాంతాల్లో ఇంధన సరఫరాను వెంటనే నిలిపివేసి, కారణాలపై విచారణ అనంతరం అవసరమైన సవరణలు చేసిన తర్వాతే సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపాయి.

90 వేల బంకుల్లో నీటి కల్తీపై నిఘా

E20లో నీరు కలుస్తోందన్న ఆరోపణలపై కూడా చమురు సంస్థలు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా సుమారు 90,000 పెట్రోల్ బంకుల్లోని భూగర్భ నిల్వ ట్యాంకులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో ట్యాంకుల్లోకి నీరు చేరినట్లు ఆధారాలు లభించలేదని తెలిపాయి. మొబైల్ ఫ్యూయల్ టెస్టింగ్ ల్యాబ్‌లతో పాటు స్వతంత్ర, గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లోనూ నమూనాలను పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి.

మరి E20పై ఎందుకీ వివాదం?

E20 అంటే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్. దిగుమతి చేసుకునే ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన మిశ్రమంలో దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్ వాటాను పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే E20 విస్తరణతో కొందరు వాహనదారులు మైలేజీ, వాహన పనితీరు, ఇంధన వ్యవస్థపై సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆటో పరిశ్రమ కూడా ఇంధన నాణ్యతను మరింత కఠినంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని కోరింది.

అయితే తాజాగా ఆటో పరిశ్రమ సంస్థ SIAM కూడా గతంలో E20 కలుషితంపై ప్రభుత్వానికి పంపిన హెచ్చరికను మరింత డేటా ధృవీకరణ అవసరమని పేర్కొంటూ వెనక్కి తీసుకుంది. దీంతో E20పై జరుగుతున్న చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. చమురు కంపెనీల తాజా సందేశం మాత్రం సుస్పష్టం. ఇప్పటివరకు నిర్వహించిన విస్తృత తనిఖీల ఆధారంగా E20 పెట్రోల్‌లో దేశవ్యాప్తంగా అధిక క్లోరైడ్ లేదా నీటి కల్తీ జరుగుతోందని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంటున్నాయి. అయినప్పటికీ నాణ్యత తనిఖీలను కొనసాగిస్తామని, ఎక్కడైనా ప్రమాణాల ఉల్లంఘన బయటపడితే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us