E30 Petrol: బిగ్ న్యూస్.. త్వరలో ఈ30 పెట్రోల్ కూడా..! కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదిగో..
త్వరలో ఈ30 పెట్రోల్ రానుందా.. ఈ20కు మించిన పెట్రోల్ వస్తుందా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ20 గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో.. ఈ30 కూడా త్వరలో రాబోతుందని అంటున్నారు.

భారతదేశంలో ప్రస్తుతం E20 పెట్రోల్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్ బంకుల్లో దీనిని ఎక్కడిక్కడ ప్రవేశపెట్టింది. సాధారణ పెట్రోల్ కంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ ధర తక్కువగా ఉంటుంది. పెట్రోల్‌కు ఎక్కువ డబ్బులు వెచ్చించలేనివారు ఈ20 పెట్రోల్ ద్వారా తమ వాహనాన్ని నడిపించుకోవచ్చు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతారు. దానినే ఈ20 పెట్రోల్‌గా చెబుతున్నారు. అయితే ఈ రకం పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని, అంతేకాకుండా సామర్థ్యం దెబ్బతినే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. మైలేజ్ తగ్గడం వాస్తవమేనని కేంద్రం అంగీకరించింది. కానీ ఇథనాల్ పెట్రోల్ వాడటం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
ఈ30 పెట్రోల్ వస్తుందా..?
అయితే ఈ30 పెట్రోల్‌ను కూడా కేంద్రం త్వరలో తీసుకురానుందనే ప్రచారం సాగుతోంది. అంటే పెట్రోల్‌లో 30 శాతం ఇథనాల్ కలుపుతారు. దీని వల్ల మరింత తక్కువగా ఉంటుంది. అయితే దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ30 పెట్రోల్‌ను తీసుకొచ్చే ప్రణాళికలు ప్రస్తుతానికి లేవని స్పష్టం చేసింది. ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం తెలిపింది. భవిష్యత్తులో దీనిని పెంచడం అనేది శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక తనిఖీలు, అలాగే కార్ల తయారీదారులు, ఇంధన కంపెనీలు, పరిశోధనా సంస్థలతో జరిపే చర్చలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. త్వరలోనే పెట్రోల్ బంకులకు E25 లేదా E30 పెట్రోల్ వస్తుందని జరుగుతున్న ప్రచారానినికి కేంద్రం ప్రకటనతో చెక్ పడింది.
ఈ20 వల్ల ప్రయోజనాలు
ప్రస్తుతానికి యజమానులు 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిగిన E20 ఇంధనాన్ని మాత్రమే వాడుతున్నారు. ఎంపిక చేసిన స్టేషన్ల ద్వారా సాధారణ లేదా తక్కువ మిశ్రమ పెట్రోల్‌ను విక్రయించడాన్ని కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో వివరణ ఇస్తూ.. భారతదేశం 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్దేశిత సమయం కంటే ఐదు సంవత్సరాల ముందే చేరుకుందని అన్నారు. సగటు మిశ్రమం 2013-14లో 1.53% నుండి 2025-26 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో 20%కి పెరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్య పొదుపు ముడి చమురు దిగుమతులలో దాదాపు 316 లక్షల టన్నుల తగ్గింపు జరిగిందన్నారు. అలాగే రైతులకు అదనంగా రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు.
