FYI: భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాల్లో డ్రైవింగ్ చేయొచ్చా? ఇది మస్ట్‌గా తెలుసుకోండి
భారత డ్రైవింగ్ లైసెన్స్ (DL)తో విదేశాల్లో కూడా వాహనం నడిపే అవకాశం ఉంది. అయితే అన్ని దేశాల్లో ఒకే నిబంధనలు ఉండవు. కొన్ని దేశాలు భారత లైసెన్స్‌ను నేరుగా అంగీకరిస్తే, మరికొన్ని దేశాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) తప్పనిసరి. విదేశాలకు వెళ్లే ముందు ఆయా దేశాల డ్రైవింగ్ నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

భారత దేశంలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ (DL) ఉన్నవారు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ వాహనం నడపవచ్చా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. సాధారణంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ కేవలం భారత్‌కే పరిమితం అని అనుకుంటారు. కానీ ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కూడా మన దేశంలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. అయితే ప్రతి దేశంలో నిబంధనలు ఒకేలా ఉండవు. కొన్ని దేశాలు భారత డ్రైవింగ్ లైసెన్స్‌ను నిర్దిష్ట కాలం వరకు నేరుగా అంగీకరిస్తే, మరికొన్ని దేశాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) తప్పనిసరిగా ఉండాలి. అందుకే విదేశీ ప్రయాణానికి ముందు ఆయా దేశాల ట్రాఫిక్ నిబంధనలను తెలుసుకోవడం అవసరం.
భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవ్ చేయగల దేశాలు
పలు దేశాలు భారత్‌లో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌ను కొన్ని షరతులతో అంగీకరిస్తున్నాయి. సాధారణంగా ఈ దేశాల్లో పర్యాటకులు లేదా తాత్కాలికంగా వెళ్లేవారు భారత లైసెన్స్‌తో పరిమిత కాలం వరకు వాహనం నడపవచ్చు.
- అమెరికా (కొన్ని రాష్ట్రాల్లో)
- యునైటెడ్ కింగ్‌డమ్ (UK)
- ఆస్ట్రేలియా (కొన్ని రాష్ట్రాల్లో)
- న్యూజిలాండ్
- సింగపూర్
- దక్షిణాఫ్రికా
- స్విట్జర్లాండ్
- నార్వే
- జర్మనీ
- ఫ్రాన్స్ (కొన్ని షరతులతో)
ముఖ్యమైన నిబంధన: మీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రామాణికంగా (డిజిటల్/చిప్ ఆధారిత) ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ, ఏ వాహనాలను డ్రైవ్ చేసేందుకు లైసెన్స్ పొందారు అనే వివరాలు, ఫొటో స్పష్టంగా ఇంగ్లీష్ భాషలో ముద్రించి ఉండాలి. అందువల్ల ప్రయాణానికి ముందు అధికారిక మార్గదర్శకాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
ఎప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) అవసరం?
భారత డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లిష్‌లో లేకపోతే లేదా సంబంధిత దేశం ప్రత్యేకంగా IDP అవసరమని కోరితే.. International Driving Permit (IDP) తీసుకోవాలి. ఇది మీ భారత డ్రైవింగ్ లైసెన్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అనువాద పత్రంలా పనిచేస్తుంది. అయితే IDP ఒక్కటే సరిపోదు. ఒరిజినల్ భారత డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీ వద్ద ఉండాలి.
విదేశాల్లో డ్రైవింగ్‌కు ముందు కొన్ని అంశాలను మస్ట్‌గా గుర్తించుకోవాలి.
- మీ భారత డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి.
- పాస్‌పోర్ట్, వీసా, అవసరమైతే IDP వెంట తీసుకెళ్లాలి.
- వాహనం అద్దెకు తీసుకునే కంపెనీ నిబంధనలు ముందుగానే తెలుసుకోవాలి.
- స్థానిక ట్రాఫిక్ చట్టాలు, వేగ పరిమితులు, బీమా నిబంధనలు పాటించాలి.
- కొన్ని దేశాల్లో కనీస వయస్సు, డ్రైవింగ్ అనుభవానికి సంబంధించిన అదనపు నిబంధనలు ఉంటాయి.
IDP ఎలా పొందాలి?
భారతదేశంలో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO) ద్వారా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే భారత డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, వీసా, ఫోటోలు తదితర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. IDP జారీ అయిన తర్వాత కూడా అసలు భారత డ్రైవింగ్ లైసెన్స్‌ను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
(గమనిక: విదేశాల్లో డ్రైవింగ్‌కు సంబంధించిన నిబంధనలు దేశానికొకలా మారుతుంటాయి. కాబట్టి ప్రయాణానికి ముందు ఆ దేశ రవాణా లేదా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో తాజా నిబంధనలు పరిశీలించడం ఉత్తమం.)
