ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో పేరు నమోదు చేసుకోవడానికి ఇంటి పన్ను రసీదు తప్పనిసరి అనే వార్తలపై తెలంగాణ ప్రభుత్వం కీలక స్పష్టీకరణ చేసింది. చాలా మంది ప్రజలలో ఉన్న ఈ అనుమానాన్ని నివృత్తి చేస్తూ, పథకంలో చేరడానికి ఇంటి పన్ను రసీదు అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఐదు లక్షల భీమా పొందాలంటే ఇంటి పన్ను కట్టిన రసీదు ఉండాల్సిందేనంటూ వాట్సాప్లో, కొన్ని గ్రామాలలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. వీటితో పాటు దరఖాస్తుదారు ఫోన్ నెంబర్, నామినీ పేరు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి పన్ను రసీదు సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పదేపదే నొక్కి చెప్పింది. డిసెంబర్ 18వ తేదీలోపు మీ గ్రామ పంచాయతీ లేదా సంబంధిత వార్డు కార్యాలయాల వద్ద నిర్వహించే క్యాంపులలో ఉచితంగా పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందగోరే వారు అనవసరమైన ప్రచారాలను నమ్మకుండా, సూచించిన పత్రాలతో నేరుగా క్యాంపులను ఆశ్రయించాలని ప్రభుత్వం కోరింది.