Silver Loan: వెండిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చా? రూల్స్ మారనున్నాయా?
గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఫ్యూచర్ లో బంగారం కంటే వెండికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని వెండిలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకం అని నిపుణులు కూడా సూచిస్తున్నారు. దీంతో వెండి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇకపై వెండిని తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకునేవిధంగా బ్యాంకులు నిర్ణయం తీసుకోనున్నట్టు మార్కెట్ వర్గాల్లో టాక్. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

బంగారంతో పాటు వెండికి కూడా మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. ఆభరణాలతోపాటు పలు ఇండస్ట్రీల్లో కూడా వెండి వాడకం పెరుగుతుండడంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెండి కొరత కూడా కనిపిస్తోంది. గడిచిన ఫెస్టివల్ సీజన్ లో కూడా బంగారంతోపాటు చాలామంది వెండి ఆభరణాలు, పూజా సామాగ్రి, ఇతర వెండి వస్తువులను బాగానే కొనుగోలు చేశారు. బంగారం ధర మితిమీరి పెరగడంతో జనం ఇప్పుడు వెండిని ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యూచర్ లో వెండి కూడా బంగారంలాగా ఒక స్థిరమైన సంపదగా మారే అవకాశం కనిపిస్తుంది. బ్యాంకులు కూడా ఇకపై వెండిపై లోన్స్ ఇస్తాయంటున్నారు.
పెరుగుతున్న డిమాండ్
ఇటీవలి కాలంలో దేశంలో వెండి దిగుమతులు పెరిగాయి. ప్రభుత్వంతో పాటు పలు భారతీయ పరిశ్రమలు కూడా వెండిని కొనుగోలు చేస్తున్నాయి. సోలార్ విద్యుత్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, 5జీ కమ్యూనికేషన్ పరికరాలు, ఎలక్ట్రానిక్ భాగాలు వంటి రంగాల్లో వెండిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ రంగాల్లో పెరిగిన అవసరాల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతదేశంలో వెండి ధరలు మరింత పెరిగిపోయాయి. అందుకే ప్రస్తుతం బంగారం లాగానే వెండికి కూడా స్థిరమైన సంపదగా స్థానం దక్కుతోంది. ఇది పెట్టుబడిదారులకు మరింత నమ్మకాన్ని కలిగిస్తూ, వెండిలో పెట్టుబడి పెట్టే అవకాశాలను విస్తరిస్తోంది.
వెండి ఆభరణాలపై లోన్స్..
ఇప్పటివరకు బంగారు ఆభరణాలపై మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. కానీ త్వరలో వెండి ఆభరణాలను కూడా తాకట్టు పెట్టి రుణం పొందే అవకాశం అందుబాటులోకి రానుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్ బీఐ (RBI) విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 2026 ఏప్రిల్ 1 నుంచి వెండి ఆధారిత రుణాలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెండి విలువను బట్టి లోన్ లిమిట్ నిర్ణయిస్తారు. కేవలం ఆభరణాలు, నగలు, నాణేలపైనే లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. వెండి బార్లు లేదా సిల్వర్ ఈటీఎఫ్‌లు తాకట్టు పెట్టి రుణం పొందడం సాధ్యం కాదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




