DBT Schemes: డీబీటీ పథకాల్లో సరికొత్త రికార్డు.. ఏకంగా 60 కోట్ల మందికి లబ్ధి
భారతదేశంలో అమల్లో ఉన్న ఆధార్ సిస్టమ్ ద్వారా కొత్త సౌలభ్యాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలకైతే లబ్ధిదారుల గుర్తింపు చాలా సులభం అయ్యింది. అలాగే ప్రభుత్వ లబ్ధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడానికి మార్గం సుగుమం అయ్యింది. తాజాగా భారతదేశంలో డీబీటీ లబ్ధిదారులు 60 కోట్లకు చేరుకున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

భారతదేశంలో 60 కోట్ల మంది లబ్ధిదారులకు డీబీటీ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. 1100 DBT పథకాలతో పాటు 1,200కి పైగా కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేశామని పేర్కొన్నారు. ముఖ్యంగా పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఈ తరహా విజయం సాధ్యమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. 49వ సివిల్ అకౌంట్స్ డేలో ఈ మేరకు ప్రకటన చేశారు.
49వ సివిల్ అకౌంట్స్ డేలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జీఈఎం, జీఎస్టీఐఎన్, టీఐఎన్ 2.0, పీఎం కిసాన్ సహా అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌ల వంటి 250 కంటే ఎక్కువ అవుట్ గోయింగ్ వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా పీఎఫ్ఎంఎస్ ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్‌లో కూడా సహాయపడిందని పేర్కొన్నారు. డిపార్ట్‌మెంటలైజేషన్ నుంచి డిజిటలైజేషన్ వరకు చేసే ప్రయాణంలో ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ పీఎఫ్ఎంఎస్ ద్వారా నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువచ్చామన్నారు.
31 రాష్ట్ర ట్రెజరీలు, 40 లక్షల ప్రోగ్రామ్ అమలు సంస్థలను ఏకీకృతం చేయడం ద్వారా సహకార సమాఖ్యవాదాన్ని బలోపేతం చేయడానికి పీఎఫ్ఎంఎస్ సాయం చేసిందని వివరించారు. లక్షలాది మంది పౌరులకు ప్రభుత్వ నిధుల సకాలంలో, పారదర్శకంగా పంపిణీని చేయడంలో పీఎఫ్ఎంఎస్ పాత్ర మరువలేనదని స్పష్టం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








