Aadhaar Card: అమల్లోకి కొత్త ఆధార్ కార్డు రూల్స్.. పూర్తిగా నిబంధనలు మార్చిన కేంద్రం.. కీలక మార్పులు ఇవే..
ఆధార్ కార్డు వినియోగదారులు అలర్ట్. ఈ నెల నుంచే ఆధార్ కార్డ్ కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆధార్ వివరాల అప్డేట్ మరింత ఈజీ అవ్వడంతో పాటు బయోమెట్రిక్ వివరాల్లో యూఐడీఏఐ పలు మార్పులు చేసింది. వీటి గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోండి.

ఆధార్ కార్డ్ అనేది రోజువారీ జీవితంలో ప్రభుత్వ సేవలతో పాటు ఇతర సేవలకు అతి ముఖ్యమైన ధృవీకరణ పత్రంగా మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి సిమ్ కార్డ్ పొందడం, ప్రభుత్వ పథకాలు లేదా సబ్సిడీలు పొందటం.. ఇలా ఆధార్ అనేది ప్రతిచోటా అవసరమవుతుంది. దీంతో ఆధార్ నియమాల్లో జరిగే మార్పులు కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తాయి. సురక్షితంగా, డిజిటల్‌గా ఆధార్ వినియోగించుకునేందుకు ఫిబ్రవరి 2026లో UIDAI అనేక మార్పులు చేసింది. ఆధార్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించేవారు తప్పనిసరిగా ఈ మార్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి
ఆధార్ వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. గత 10 సంవత్సరాలలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌ను అప్‌డేట్ చేసుకోని వ్యక్తులు త్వరగా పూర్తి చేయాలని UIDAI స్పష్టం చేసింది. కొన్నిసార్లు ప్రింగర్ ఫ్రింట్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ సమయంలో పాత బయోమెట్రిక్ డేటా సరిగ్గా మ్యాచ్ అవ్వడం లేదు. దీంతో బ్యాంకింగ్, సిమ్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఆధార్‌ను ఉపయోగించేటప్పుడు వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇక 15 సంవత్సరాల వయస్సు తర్వాత పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేయించడం తప్పనిసరి. చిన్న వయస్సులో తీసుకున్న బయోమెట్రిక్ వివరాలు ఇప్పుడు పనిచేయవు. దీంతో ఇప్పుడు మళ్లీ కొత్తగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఫేస్ రికగ్నిషన్ అప్డేట్
ఇక ఆధార్ ఈకేవైసీ ప్రక్రియ కూడా యూఐడీఏఐ అప్‌గ్రేడ్ చేసింది. గతంలో వేలిముద్రలు, ఐరిస్ ఆధారంగా వెరిఫికేషన్ చేసేవారు. కానీ వృద్ధులు, కార్మికుల్లో చేతివేళ్లు అరిగిపోయిన వారికి బయోమెట్రిక్ ధృవీకరణ సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని పరిష్కరించడానికి UIDAI ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని విస్తరిస్తోంది. దీంతో గుర్తింపును నిర్ధారించడానికి మీ ముఖాన్ని అదనపు ఆప్షన్‌గా ఉపయోగించవచ్చు. ఈకైవేసీ మరింత వేగంగా పూర్తి అవ్వడంతో పాటు కేవలం వేలిముద్రలపై మాత్రమే ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
మొబైల్, అడ్రస్ అప్డేట్ ఈజీ
ఇక కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ ఇటీవల తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మొబైల్ నెంబర్, అడ్రస్ సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడినుంచైనా ఆధార్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. గతంలో ఆధార్ సెంటర్ లేదా యూఐడీఏఐ పోర్టల్‌లోకి వెళ్లి వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి వచ్చేంది. కానీ ఇప్పటినుంచి కేవలం ఈ ఆధార్ యాప్ ఉపయోగించి మీ మొబైల్ నుంచి అడ్రస్, మొబైల్ నెంబర్ వంటివి సులువుగా నిమిషాల్లోనే మార్చుకోవచ్చు. ఇక మీ కుటుంబసభ్యుల ఆధార్ వివరాలు అన్నీ ఒకేచోట ఉంచుకోవచ్చు.
