UPI payments: బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేదా..? క్రెడిట్ కార్డుతో ఆ సమస్యకు చెక్
ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలుగా జోరుగా సాగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లోని వివిధ యాప్ లను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా అన్ని రకాల చెల్లింపులు వేగంగా చేస్తున్నారు. రోడ్డు పక్కన ఉండే బండి వద్ద అరటి పండ్లు కొనుగోలు చేసినా, ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ చేసినా డబ్బులను మాత్రం యూపీఐ ద్వారా చిటికెలో చెల్లించవచ్చు. మీకు స్మార్ట్ ఫోన్ తోపాటు, మీ పొదుపు ఖాతాలో డబ్బులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అయితే కొందరికి పొదుపు ఖాతాలో డబ్బులు ఉండవు, వారి వద్ద క్రెడిట్ కార్డు మాత్రమే ఉంటుంది. మరి ఆ సమయంలో క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ లావాదేవీలు చేసే వీలుంటుందా, నిబంధనలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2022లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యూపీఐ వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డులను ఖాతాకు లింక్ చేసుకుని లావాదేవీలు జరపొచ్చు. వారి పొదుపు ఖాతాలో డబ్బులు లేని సమయంలో రూపే క్రెడిట్ కార్డులో మొత్తాన్ని యూపీఐ లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల వారి అవసరాలు తీరడంతో పాటు క్యాష్ బ్యాక్ లు, బహుమతులు కూడా లభిస్తాయి. ప్రస్తుతం వివిధ బ్యాంకులు కూడా తమ ఖాతాదారులను ఆకట్టుకునేందుకు యూపీఐ లావాదేవీలు జరుపుకొనే క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టాయి. వీటి వినియోగంపై కస్టమర్లకు 3 నుంచి 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా అందిస్తున్నాయి.
బ్యాంకు ఖాతాకు బదులుగా యూపీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కస్టమర్లు అన్ని రకాల లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే వీటిపై కొన్ని నిబంధనలు విధించారు. కస్టమర్ టు మర్చంట్ (సీ2ఎం) లావాదేవీలకు మాత్రమే యూపీఐ క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పడు, హోటళ్లలో బిల్లు కట్టినప్పుడు వాడుకోవచ్చు. అంటే వ్యాపారులతో జరిపే లావాదేవీలకు మాత్రమే వీలుంటుంది. అలాగే పీర్ టు పీర్ (పీ2పీ) బదిలీలకు ఈ కార్డు ద్వారా లావాదేవీలు జరగవు. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులకు డబ్బులు బదిలీ చేయడానికి అంగీకరించదు. యజమానికి ఇంటి అద్దెను చెల్లించడానికి కూడా వీలుండదు.
యూపీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఒక వ్యాపారికి డబ్బులు చెల్లిస్తున్నప్పుడు, అతడి క్యూాఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే మన ఫోన్ లో క్రెడిట్ కార్డు ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే చెల్లింపు పూర్తవుతుంది. అదే సమయంలో స్నేహితులకు డబ్బులు బదిలీ చేస్తే మాత్రం ఆ ఆప్షన్ కనిపించదు. అలాగే సీ2సీ చెల్లింపులకు మాత్రమే యూపీఐ రివార్డులు వర్తిస్తాయి.
క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులను ప్రాసెస్ చేయడం కోసం బ్యాంకులు లేదా సంస్థలకు వ్యాపారులు మర్చంట్ డిస్కౌంట రేటు (ఎండీఆర్) పేరుతో కొంత చార్జీ చెల్లించాలి. దీన్ని ఇష్టపడని కొందరు వ్యాపారులు క్రెడిట్ కార్డు లావాదేవీలను అంగీకరించరు. అయితే ఖాతాదారులకు మాత్రం ఉపయోగంగా ఉంటాయి. యూపీఐ క్రెడిట్ కార్డులను దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకులు అందజేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








