Inherited assets: వారసత్వ ఆస్తులపై పన్ను కట్టాలా..? కీలక నిబంధనలు ఏంటంటే?
వెంకట్రావుకు తన తాత గారి నుంచి వారసత్వంగా ఒక ఇల్లు లభించింది. దానికి చిన్నచిన్న మరమ్మతులు చేయించుకుని, కుటుంబం కలిసి దానిలో నివాసం ఉన్నాడు. కొన్నేళ్లకు సొంతంగా ఇక ప్లాట్ కొనుక్కొని, దానిలోకి మారిపోయాడు. తాత నుంచి వచ్చిన పాత ఇంటిని అద్దెకు ఇచ్చాడు. అయితే పాత ఇంటి నుంచి వచ్చిన అద్దెపై పన్ను కట్టాలని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. తెలిసిన వారికి సంప్రదించగా, అద్దెపై పన్ను కట్టాలని చెప్పారు. ఇలాంటి అనుభవం వెంకట్రావుకు మాత్రమే కాదు, మనలో చాలా మందికి కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారసత్వంగా వచ్చిన ఆస్తులపై పన్ను ఎలా విధిస్తారో తెలుసుకుందాం.

పూర్వికుల నుంచి వచ్చిన ఆస్తులపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిపై కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. సాధారణంగా పూర్వికుల నుంచి వచ్చిన ఆస్తి అంటే తాతమామలు, తల్లిదండ్రులు, ఇతర బంధువుల నుంచి మనకు సంక్రమించిన ఆస్తి అని చెప్పవచ్చు. వీలునామా ద్వారా దానిపై మనకు హక్కు వస్తుంది. ఈ ఆస్తులు ఆస్తిపన్నుకు లోెబడి ఉంటాయా అన్నదే అందరి ప్రశ్న. దానికి అవుననే సమాధానం చెప్పవచ్చు.
మన దేశంలో ఒకప్పుడు పూర్వికుల ద్వారా వచ్చిన ఆస్తులపై పన్ను విధించేవారు. దాన్ని వారసత్వ పన్ను అని పిలిచేవారు. ఆ పన్నును 1985లో రద్దు చేయడంతో వారసత్వ ఆస్తులు పన్ను పరిధి నుంచి బయటకు వచ్చేశాయి. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. వారసత్వ ఆస్తులపై ఎలాంటి పన్ను విధించరు. కానీ ఆ ఆస్తి నుంచి వచ్చే ఏ ఆదాయమైనా అంటే అద్దె, అమ్మకం ద్వారా వచ్చే మూలధన లాభాలు, అనుబంధ బ్యాంకు ఖాతా నుంచి వచ్చే వడ్డీపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి.
- ఒక వ్యక్తి తన తాత ఇంటిని వారసత్వంగా పొందాడనుకుందాం. ఆ తర్వాత దాన్ని అద్దెకు ఇస్తే ఆ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో వడ్డీ అందించే బ్యాంకు ఖాతాలు ఉంటే, అవి సంపాధించే వడ్డీకి కూడా పన్ను కట్టాలి.
- వారసత్వం కింద వచ్చిన భూమి, ఇంటిని అమ్మితే మూలధన లాభాల పన్ను చెల్లించాలి. అసలు యజమాని కొనుగోలు చేసిన తేదీ ఆధారంగా ఈ పన్నును లెక్కిస్తారు. రెండు, అంతకంటే ఎక్కువ కాలం ఆస్తిని కలిగి ఉండడం వల్ల ధీర్ఘకాలిక మూలధన లాభాలు వస్తాయి. దానికి కొన్ని మినహాయింపులతో 20 శాతం పన్ను కట్టాలి.
- రెండు సంవత్సరాల లోపు అమ్మడం వల్ల స్వల్పకాలిక లాభాలు వస్తాయి. ఒకరి ఆదాయ శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.
- వారసత్వంగా వచ్చిన ఆస్తికి పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే దాని నుంచి ఆదాయం పొందితే మాత్రం పన్ను వర్తిస్తుంది.
- ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను అర్థం చేసుకోవడం ద్వారా పన్ను చెల్లించే సమయంలో గందరగోళానికి గురి కాకుండా ఉండవచ్చు.








