NPS: ఆ పథకంతో విశ్రాంత జీవితానికి భరోసా..లాభాలు ఏంటో తెలుసా?
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వివిధ లక్ష్యాలను సాధించాలని నిర్దేశించుకుంటారు. వాటిని చేరుకోవడం కోసం నిత్యం కష్టపడతారు. భార్యాపిల్లలను బాగా చూసుకోవాలని, వారి కోసం సొంతంగా ఇల్లు కట్టాలని, బంగారం కొనాలని నిర్ణయించుకుంటారు. కష్టబడి పనిచేసి, ఆ కలలను నెరవేర్చుకుంటారు. కానీ తమ విశ్రాంత జీవితం గురించి అస్సలు ఆలోచించరు. కానీ రిటైర్మెంట్ అనేది అందరికీ ఒక ముఖ్యమైన దశ. ఆ సమయంలో కష్టబడటానికి ఒంట్లో ఓపిక ఉండదు. అనారోగ్య కారణాలతో మెడికల్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విశ్రాంత జీవితాన్ని సంతోషంగా గడపటానికి అనేక రిటైర్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. వాటిలో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) గురించి తెలుసుకుందాం.

చాలామంది భారతీయులు పదవీ విరమణ ప్రణాళికల గురించి పట్టించుకోరు. ఆ విషయాన్ని తర్వాత ఆలోచిద్దామని నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఆ పద్ధతి సరికాదు. ఉద్యోగం చేస్తున్నసమయంలో రిటైర్మెంట్ పథకాల్లో డబ్బులు వెచ్చించడం వల్ల విశ్రాంత జీవితానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. ఆధునిక కాలంలో ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు. వారికి రిటైర్మెంట్ తర్వాత ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇలాంటి సమయంలో ఎన్పీఎస్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నేషనల్ పెన్సన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న మార్కెట్ లింక్డ్, స్వచ్ఛంద, దీర్ఘకాలిక పదవీ విరమణ ప్రణాళిక. మీరు ఉద్యోగం చేస్తున్న సమయంలో దీనిలో పెట్టుబడి పెడితే, రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో రాబడిని అందిస్తుంది. మీకు ప్రతి నెలా పెన్షన్ రూపంలో ఆదాయం అందిస్తుంది. ఈ స్కీమ్ ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణ చేస్తుంది.
ఎన్‌పీఎస్ స్కీమ్ లాభాలివే
- దేశంలో అతి తక్కువ పెట్టుబడితో చేరగల పథకాలలో ఎన్పీఎస్ ఒకటి. దీనిలో ఇన్వెస్ట్ చేసిన డబ్బును పీఎఫ్ఆర్డీఏ నియమించిన అనుభవం కలిగిన పెన్షన్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. మీ పెట్టుబడికి పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది.
- ఎన్పీఎస్ లో పెట్టుబడులు ధీర్ఘకాలంలో మెరుగైన రాబడిని అందిస్తాయి. ఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు.
- దీనిలోని చందాదారులకు తమ పెట్టుబడిని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఏటా ఒకసారి పెన్షన్ ఫండ్ మేనేజర్ ను మార్చుకోవచ్చు. లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు చేసుకోవచ్చు.
- పాత, కొత్త పన్ను విధానాల్లోనూ ఎన్పీఎస్ చందాదారులు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
- ఎన్పీఎస్ లో ప్రతి నెలా రూ.5 వేలు పెట్టుబడి పెడితే 25 నుంచి 30 ఏళ్లలో రూ.కోటి వరకూ పెరిగే అవకాశం ఉంటుంది.
- చందాదారుడికి 60 ఏళ్లు వచ్చాక మూలధనంలో 60 శాతాన్ని పన్ను లేకుండా ఏకమొత్తంగా ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి. తద్వారా క్రమం తప్పకుండా జీవితాంతం పెన్షన్ వస్తుంది.
- ఉద్యోగాలు మారినా, వేరేచోటుకు బదిలీ అయినా ఎన్ఫీఎస్ ఖాతాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. జీవితాంతం మీతోనే ఉంటుంది. ఖాతా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో ట్రాక్ చేయవచ్చు.








