SSY calculator: సుకన్య యోజనతో బాలికలకు భరోసా..మెచ్యూరిటీ సొమ్మును లెక్కింపు కీలకం
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువే. వారికి సక్రమంగా విద్యాబుద్దులు నేర్పిస్తే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆగ, మగ పిల్లలు ఎవరైనా సరే చదువుతోనే వారి జీవితం ప్రకాశవంతమవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తు బాగుండాలంటే విద్య అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ఆడ పిల్లల చదువు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) అనే పథకాన్ని తీసుకువచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తీసకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) పథకంలో ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తే, మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు అందుతాయి. ఆడ పిల్లల చదువు, వివాహానికి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ వై క్యాలిక్యులేటర్ ను ఉపయోగించి మెచ్యూరిటీ సమయానికి వచ్చే మొత్తాన్ని చాలా సులభంగా లెక్కించవచ్చు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎస్ఎస్ వై అనే పొదుపు పథకాన్ని ప్రవేశ పెట్టింది. పదేళ్ల లోపు బాలికల కోసం దీన్ని తీసుకువచ్చారు. పిల్లల పేరు మీద తల్లిదండ్రులు, సంరక్షకులు ఖాతాను తెరవొచ్చు. బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని దీనిలో పొదుపు చేసుకుంటూ వెళ్లాలి. దీనిలో పెట్టిన పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని 80సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం ఎస్ఎస్ వైకి ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందిస్తున్నారు.
బాాలిక వయసు, మీ పెట్టుబడి ఆధారంగా మెచ్యూరిటీ నాటికి ఎంత మొత్తం వస్తుందో లెక్కలు వేయవచ్చు. దీనికి ఎస్ఎస్ వై క్యాలిక్యులేటర్ ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా మీ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది. A=p(1+r\n)^nt అనే చక్రవడ్డీ సూత్రం ఆధారంగా లెక్కలు వేయవచ్చు. దీనిలో ఏ అంటే తుది మెచ్యూరిటీ విలువ, పి అంటే మీ పెట్టుబడి, ఆర్ అంటే వడ్డీరేటు, ఎన్ అంటే ఏడాదికి అందించే వడ్డీ, టి అంటే సంవత్సరాలను సూచిస్తుంది. ఉదాహరణకు మీ అమ్మాయికి మూడేళ్ల వయసు అనుకుందాం. 15 ఏళ్ల పాటు మీరు ఏడాదికి రూ.1.5 లక్షలను పెట్టుబడి పెట్టారు. ఆమెకు 21 ఏళ్లు నిండినప్పుడు సుమారు రూ.65 లక్షలు వస్తుంది.
కీలక విషయాలివే
- ఎస్ఎస్ వై క్యాలిక్యులేటర్ వినియోగించడం వల్ల సులభంగా, త్వరగా లెక్కలు వేయవచ్చు. మాన్యువల్ గా లెక్కించాల్సిన అవసరం లేదు. తక్షణమే ఫలితాలను చూపిస్తుంది.
- మీ కుమార్తె భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పొదుపు చేసుకునే వీలు కలుగుతుంది. పథకం మెచ్యూరిటీ సమయానికి ఎంత డబ్బు వస్తుందో స్పష్టంగా చెబుతుంది.
- మెచ్యూరిటీ మొత్తం తెలియడంతో మీకు అవసరమైన సర్దుబాట్లు చేసుకోవచ్చు. ప్రతి నెలా పెట్టుబడిని మరింత పెంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








