Indian Railways: రైళ్లల్లో మీ వస్తువులు మర్చిపోయారా..? ఈ ఒక్క యాప్ మొబైల్‌లో ఉంటే చాలు..
కొంతమంది బస్సులు, రైళ్లల్లో వెళ్లేప్పుడు వస్తువులను మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో తిరిగి ఎలా రాబట్టుకోవాలనే విషయం తెలియదు. అయితే రైళ్లల్లో వస్తువులు మర్చిపోతే మీరు సులువుగా రైల్వేశాఖకు సమాచారం అందించవచ్చు. ఇందుకోసం ఓ యాప్ రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటి అనేది చూద్దాం.

బస్సులు, రైళ్లల్లో వెళ్లేటప్పుడు పొరపాటున వెంట తెచ్చుకున్న వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి..? అనే విషయం చాలామందికి తెలియదు. ఆర్టీసీ బస్సుల్లో మర్చిపోతే ఆర్టీసీ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా వస్తువులను తిరిగి పొందవచ్చు. అయితే ట్రైన్‌లో మర్చిపోతే ఏం చేయాలి..? ఎవరిని సంప్రదించాలి..? తిరిగి వస్తువులను ఎలా తెచ్చుకోవాలి? అనేది చాలామందికి అవగాహన ఉండదు. అయితే రైళ్లల్లో వస్తువులు మర్చిపోతే సులువుగా పొందవచ్చు. ఇందుకోసం డిజిటల్ సేవలను రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు సులభంగా మీ వస్తువులను తిరిగి పొందవచ్చు. అదేలా అనేది ఇందులో చూద్దాం.
రైల్ మదద్ యాప్
మీరు రైళ్లల్లో ఏమైనా వస్తువులు మర్చిపోతే ఆందోళన పడాల్సిన పని లేదు. వెంటనే మీ ఫోన్‌లో రైల్ మదద్ అనే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత యాప్‌లోకి లాగిన్ అయ్యి రైల్వేశాఖకు సమాచారం అందించండి. ఈ యాప్ ద్వారా రైల్వేశాఖకు ఫిర్యాదు చేయండి. దీంతో అధికారులు వెంటనే సంప్రదించి మీకు సహాయం అందిస్తారు. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు స్టేటస్ కూడా యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. రైల్వేశాఖకు చెందిన ఈ యాప్ ద్వారా మీరు అత్యంత వేగంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
ఎలా ఫిర్యాదు చేయాలి..?
-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి రైల్ మదద్ అని సెర్చ్ చేయండి
-యాప్ డౌన్ లోడ్ చేసుకోండి
-యాప్ ఓపెన్ చేసి మీ పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయండి
-మీరు పొగోట్టుకున్న వస్తువుకు సంబంధించిన సమాచారం ఇవ్వండి
-బ్యాగ్ రంగు, పరిమాణం, కోచ్ నెంబర్, సీటు నెంబర్, అందులో ఏముంది అనే సమాచారం అందించాలి
-ఆ తర్వాత ఫిర్యాదును సబ్మిట్ చేయాలి
-సబ్మిట్ చేశాక మీకు గ్రీవెన్స్ ఐడీ వస్తుంది
-ఆ ఐడీ సాయంతో మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదు
ఇక యాప్ ద్వారానే కాకుండా పోర్టల్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇందుకోసం railmadad.indianrailways.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లండి. అందులోకి వెళ్లి సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేయండి. మీరు వస్తువును మర్చిపోయిన తర్వాత ఎంత వేగంగా సమాచారం అందిస్తే అంత త్వరగా అధికారులు స్పందించి మీకు సాయం అందిస్తారు. ఫిర్యాదు అందగానే రైల్వే సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేస్తారు. దీని వల్ల మీ వస్తువు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 24 గంటల పాటు ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు. ఇక రైళ్లల్లోని సౌకర్యాలపై కూడా రైల్ మదద్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. టాయిలెట్లు, శుభ్రత, రైలు ఆలస్యం, టికెట్ సమస్యలు లాంటి వాటిపై కూడా కంప్లైంట్ చేయవచ్చు.
