Currency Notes: కరెన్సీ నోట్ల అంచుల వద్ద ఈ గీతలు ఎందుకుంటాయి..? ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే..
కరెన్సీ నోట్లపై ముద్రించి ఉన్న చాలావాటికి కారణాలు ఏంటనే విషయం మనలో చాలామందికి తెలియదు. భారత కరెన్సీ నోట్లపై అంచుల చివర మీరు గీతలను గమనించే ఉంటారు. ఇవి ఎందుకు ఉంటాయో మీకు తెలుసా.. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటనేది చూద్దాం.

కరెన్సీ నోట్లను మనం తరచూ వాడుతూ ఉంటాం. ఆన్‌లైన్ లావాదేవీలతో డిజిటల్ రూపంలో కరెన్సీని వాడుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలామంది నగదును తమ వ్యాలెట్లలో ఉంచుకుంటారు. అకౌంట్‌లో డబ్బు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యూపీఐ సౌకర్యం ఉండదు. దీంతో పాటు కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల యూపీఐ చెల్లింపులు చేయలేదు. ఇలాంటి సమయంలో అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చాలామంది తమ వద్ద ఎంతో కొంత లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకుంటారు. అయితే మీ వద్ద ఉండే రూ.100, రూ.200, రూ.500 కరెన్సీ నోట్లపై కుడి,ఎడుమ రెండు వైపులా చిన్న గీతలు ముద్రించి ఉండటం మీరు గమనించే ఉంటారు. అసలు అలా ఎందుకు గీస్తారనేది మీకు తెలుసా..?
బ్లీడ్ మార్క్స్ ఎలా ఉంటాయంటే..?
కరెన్సీ నోట్లపై ఉండే ఈ గీతలను బ్లీడ్ మార్క్స్ అంటారు. అలాగే స్వర్శ గుర్తులని కూడా వీటిని పిలుస్తారు. నోటుకు రెండు వైపులా ఇవి ఉంటాయి. రూ.100 నోటుపై రెండు వైపులా నాలుగు గీతల చొప్పున ఉంటాయి. ఇక రూ.200 నోటుపై నాలుగు గీతలతో పాటు మధ్యలో రెండు చిన్న చిక్కులు కూడా ఉంటాయి. రూ.500 నోటుపై ఇరువైపులా ఐదు గీతలు ఉంటాయి.
ఈ గుర్తు ఎందుకంటే..?
దృష్టి లోపంతో బాధపడేవారు లేదా కంటిచూపు లేనివారు సలుభంగా నోట్లను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ నోట్ల అంచుల వద్ద ఉండే ఈ గీతలు కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. దీంతో వీటిని తాకడం వల్ల అది ఏ కరెన్సీ నోటు అనేది ఈజీగా గుర్తు పట్టవచ్చు. కంటిచూపు లేనివారు వేరేవారిపై ఆధారపడకుండా సులువుగా గుర్తించవచ్చు.
నకిలీ నోట్లను గుర్తించవచ్చు
ఇక నకిలీ నోట్ల చలామణిని అడ్డుకునేందుకు కూడా ఈ గుర్తులు ఉపయోగపడతాయి. నకిలీ నోట్లను ముద్రించేందుకు కలర్ జిరాక్స్‌లను ఉపయోగిస్తారు. కానీ అసలైన నోట్లపై బ్లీడ్ మార్క్స్ ఇంటాగ్లియో ప్రింటింగ్ ఆధారంగా ముద్రిస్తారు. దీని వల్ల ఈ గుర్తులను జాగ్రత్తగా గమనించడం లేదా స్పర్శ ద్వారా నకిలీ నోట్లను గుర్తించవచ్చు. దీంతో పాటు కరెన్సీ మధ్య తేడాను కూడా గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి.
